రాక్షాసానందం పొందుతున్నారు.. అదీ దుష్ప్రచారామే: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విషయంలో దుష్ప్రచారం జరుగుతుంది. దీనిపై కొందరు సోషల్ మీడియా కోడై కూస్తోన్న సంగతి తెలిసిందే. దీనిని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. డబ్బున్న వారి ప్రయోజనాలు పరిరక్షించే కుట్రతో కొందరు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సామాన్య భక్తులకు కేటాయించే ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచుతున్నామని చెప్పలేదన్నారు. స్వామివారి సేవా టికెట్ల జారీలో వీఐపీల ఒత్తిడి తగ్గించి సామాన్య భక్తులకు సేవా టికెట్లు మరిన్ని అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో పాలకమండలి సమావేశంలో చర్చించామని వెల్లడించారు.
పాలక మండలి సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలనే ఎస్వీబీసీలో లైవ్ ఇస్తున్నాం అని తెలిపారు. నాలుగు గోడల మధ్య కూర్చుని రహస్యంగా చర్చించ లేదన్నారు. దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగి రాక్షసానందం పొందాలని చూడటం దౌర్భగ్యం అన్నారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు టీటీడీ ఎట్టిపరిస్థితుల్లో తీసుకోదని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. పాలకమండలి సమావేశంలో తాను మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంపుపై చాలాకాలంగా చర్చ జరుగుతోంది. సేవా టికెట్లు పరిమితంగా ఉండగా, సిఫారసు లేఖలు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయి. సిఫారసులను తగ్గించేందుకు విచక్షణ కోటాలో ఉన్న సేవా టికెట్ల ధరలను పెంచితే ఎలా ఉంటుందనే విషయంపై చర్చ మాత్రమే జరిగింది. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సామాన్యులకు కేటాయించే ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంచాలనే ఆలోచనే లేదని స్పష్టంచేశారు.
Recommended Video
శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు (శ్రీవాణి) ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార ప్రాంతాల్లో ఇప్పటికే మొదటి విడతగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 502 శ్రీవారి ఆలయాలు నిర్మించాం. రెండో విడతగా 1100 ఆలయాల నిర్మాణం, అభివృద్ధి, జీర్ణోద్ధరణ పనులకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం. జీవిత కాలంలో ఒక్కసారైనా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోలేని పేద వర్గాలను ఆహ్వానించి ఉచితంగా శ్రీవారి దర్శనం చేయిస్తున్నామని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications