ఏపీలో బార్ లైసెన్స్ గడువు పొడిగింపు..! లాటరీకి కొత్త ముహుర్తం..!
ఏపీలో కొత్తగా బార్ లైసెన్స్ లకు దరఖాస్తుల స్వీకరణ మరి కొంతకాలం కొనసాగబోతోంది. ఇప్పటికే ప్రకటించిన మేరకు ఇవాళ్టితో బార్ లైసెన్స్ ల దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసింది. అయితే ప్రభుత్వం అనుకున్న మేరకు స్పందన రాకపోవడం, వరుసగా సెలవులు రావడం వంటి కారణాలతో అధికారులు పునరాలోచనలో పడ్డారు. చివరికి బార్ లైసెన్స్ ల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు.
వాస్తవానికి రాష్ట్రంలో బార్ లైసెన్స్ లకు దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన గడువు ముగిసినా ఆశించిన స్దాయిలో దరఖాస్తులు రాలేదు. మొత్తం 840 బార్లకు 90 దరఖాస్తులు దాఖలు అయినట్లు తెలుస్తోంది. కొత్త బార్ పాలసీ ప్రకారం ఒక్కో బార్ కు నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ తీస్తారు. అయితే ఇప్పటి వరకు కేవలం తొమ్మిది బార్లకే నాలుగు దరఖాస్తులు దాఖలు అయినట్లు సమాచారం. దీంతో అధికారులు గడువు పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 29 వరకూ దరఖాస్తుల గడువు పెంచారు.

బార్ లైసెన్స్ దరఖాస్తుల గడువు ఆగస్టు 29 సాయంత్రం 6 గంటల వరకు గడువు పొడిగిస్తున్నట్లు ఎక్సైజ్ కమీషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు. లాటరీ డ్రా ఆగస్టు 30 ఉదయం 8 గంటలకు నిర్వహిస్తామని నిశాంత్ కుమార్ వెల్లడించారు. వినాయక చవితి, బ్యాంకు సెలవుల దృష్ట్యా గడువు పొడిగించినట్లు కమిషనర్ తెలిపారు. నిరంతర వర్షాలు, వరదల కారణంగా దరఖాస్తుల సమర్పణలో ఇబ్బందులు వచ్చాయన్నారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ సవరించిన షెడ్యూల్ విడుదల చేసింది.
అలాగే కొత్త గడువులపై విస్తృత ప్రచారం చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు పంపింది.












Click it and Unblock the Notifications