ఓనమాలు చెబుతున్నా కన్నా... 'మమతల రుచి' చూపించిన జిల్లా కలెక్టర్!
బంగారు భవితకు బాటలు వేసుకోవడానికి పాఠశాల గదిలో పుస్తకాలతో కుస్తీ పడుతున్న విద్యార్థులను చూసి ఆమె ముచ్చటపడ్డారు. తాను జిల్లా మొత్తానికి సర్వాధికారిననే విషయాన్ని ఆ సమయంలో మరిచిపోయారు. వెంటనే ఉపాధ్యాయురాలిగా మారారు.. విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఆమె తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె.మాధవీలత. అదే జిల్లా కడియం మండలం వేమగిరిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కలెక్టర్ వేమగిరిలోని పేరూరి గంగాధరరావు హైస్కూల్లో జరుగుతున్న 'నాడు-నేడు' పనులు పరిశీలించేందుకు వచ్చారు. ఆ సమయంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల గదికి వెళ్లారు. ఎలా చదువుతున్నారు? పరీక్షలు ఎలా ఎదుర్కొంటారు? భయపడవద్దంటూ ధైర్యం చెప్పారు. తర్వాత వారిని కొన్ని ప్రశ్నలు అడిగారు.

మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు?
మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు? అనే ప్రశ్నకు సరైన సమాధానం చాలామంది విద్యార్థులు చెప్పలేకపోయారు. రాష్ట్రంలో కొత్తగా జిల్లాలు ఏర్పడ్డాయని, 13 నుంచి 26 జిల్లాలుగా మారిన విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా కేంద్రం ఏది? అనే ప్రశ్నకు కాకినాడ అనే సమాధానం వచ్చింది. దీంతో కలెక్టర్ కొత్తగా మారిన జిల్లాల గురించి, వాటి కేంద్రాల గురించి ప్రతి విద్యార్థికి తెలియజేసేలా బోధన ఉండాలని సూచించారు. ఈమేరకు పక్కనే ఉన్న జిల్లా విద్యాశాఖాధికారి అబ్రహంకు ఆదేశాలు జారీచేశారు.

విద్యార్థులకు జనరల్ నాలెడ్జి చాలా అవసరం
విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ ఎంతో అవసరమని, ఇంటి దగ్గర ఉన్న సమయంలో పత్రికలు చూడాలని హితవు పలికారు. ఇంగ్లీషు భోదన ఎలా ఉందని విద్యార్థులను కలెక్టర్ అడిగారు. కొందరు విద్యార్థులు ఇంగ్లీషులో చదవడానికి ఇబ్బంది పడుతుండటాన్ని ఆమె గమనించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గ్లోబలైజేషన్ వాతావరణానికి పోటీ పడాలని, అందుకు ఇంగ్లీషు భాష అవసరం ఉందని చెప్పారు. మాతృభాష తెలుగుతో పాటు పాఠశాలలో ఇంగ్లీష్ లో కూడా మాట్లాడడం అలవర్చుకోవాలని సూచించారు.
మేడం.. మీరు కూడా టీచర్ అయితే బాగుండేది!!
తూర్పుగోదావరి జిల్లాకే చెందిన బెండపూడి హైస్కూలు విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే తీరును ఇక్కడ విద్యార్థులకు మాధవీలత ఉదాహరణగా వివరించారు. సుమారు 20 నిమిషాల పాటు ఉపాధ్యాయురాలుగా కలెక్టర్ మాధవీలత విద్యార్థులకు పాఠాలు బోధించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆమె పాఠాలు చెప్పిన తీరుకు ఆ పాఠశాల ఉపాధ్యాయులు కూడా ముగ్ధులయ్యారు. మేడం.. మీరు టీచర్ అయితే ఎంతో బాగుండేదంటూ వారంతా సరదాగా ఆమెతో వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications