TDP ఇలా తమ ఓటర్లను డిసైడ్ చేసుకుంటోంది
Chandra Babu Godavari Dists Tour: టీడీపీ అధినేత చంద్రబాబు గోదావరి జిల్లాల పర్యటకు వస్తున్నారు. టీడీపీ ఇప్పటికే ప్రకటించిన 'ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి' కార్యక్రమాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం విజయరాయి గ్రామంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ ప్రతిష్ఠాత్మకం తీసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏభై రోజుల్లో ఏభై లక్షల కుటుంబాలను కలవాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకొంది. మొత్తం ఎనిమిది వేల పార్టీ బృందాలను నియమించారు. ఇదే సమయంలో కొత్త విధానం అమలు చేస్తున్నారు. తమ ఓటర్లను ముందుగానే గుర్తించే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు.

గోదావరి జిల్లాల్లో 3 రోజుల బాబు పర్యటన..
టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజులపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. కలపర్రు చెక్ పోస్టు నుంచి విజయరాయి వరకు వేల మోటారు సైకిళ్లతో ర్యాలీగా వెళ్లి చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు కార్యకర్తలు సన్నాహాలు చేశారు. సాయంత్రం చింతలపూడిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ నుంచి కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం గ్రామానికి చేరుకొని దండమూడి రామలక్ష్మి ఫంక్షన్ హాల్లో రాత్రి బస చేస్తారు. గురువారం ఉదయం పదిన్నర గంటలకు అక్కడ నుంచి బయలుదేరి కొయ్యలగూడెం, కన్నాపురం, కేఆర్ పురం ఐటీడీఏ, పట్టిసీమ మీదుగా పోలవరం గ్రామం చేరుకొంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగ సభ జరుగుతుంది. అక్కడ నుంచి తాడిపూడి, వేగేశ్వరపురం, కుమారదేవం మీదుగా ఆయన కొవ్వూరు పట్టణం చేరి అక్కడ రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రి 8గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. గ్రామగ్రామాన కార్యకర్తలు, నేత లు ఎక్కడికక్కడ చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు చేశారు.

గడప గడపకు ప్రభుత్వ ప్రోగ్రాంకు పోటీగా..
ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో ఎమ్మెల్యేలు గడపగడపకు ప్రభుత్వం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఎమ్మెల్యే తీరు సీఎం జగన్ టికెట్ల కేటాయింపుకు కొలమానంగా తీసుకుంటున్నారు. దీంతో, దాదాపు నాలుగు నెలలుగా వైసీపీ నేతలంతా ఈ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో టీడీపీ ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 'ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి' అనే కార్యక్రమాన్ని సిద్దం చేసింది. కార్యక్రమాన్ని కొంత విభిన్నంగా రూపొందించారు. ఏడెనిమిది ముఖ్యమైన ప్రజా సమస్యలను ఎంచుకొని వాటిపై ప్రతి ఇంటా వివరించాలని నిర్ణయించారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్రచార వీడియోలను ప్రత్యేకంగా రూపొందించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. కొన్ని పాటలు కూడా దీని కోసం విడుదల చేసే ప్రయత్నం జరుగుతోంది. పార్టీ నేతలకు అవసరమైన సమాచారం... ప్రతి ఇంటా ఇవ్వాల్సిన కరపత్రాలు కూడా సిద్ధం చేసి అన్ని నియోజకవర్గాలకు పంపారు.

తమ ఓటర్లను గుర్తించేలా కొత్త కార్యక్రమం..
ఈ కార్యక్రమం ద్వారా టీడీపీ తమ ఓటర్లను తేల్చుకొనే పని మొదలు పెట్టింది. గడప గడపకు ప్రభుత్వం ద్వారా తమ సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్దిదారులు తమతోనే ఉండేలా వైసీపీ ఇంటింటికీ ప్రచారం చేస్తోంది. ఇదే సమయంలో..టీడీపీ 'ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి' కార్యక్రమం పేరుతో ప్రతీ ఇంటికి వెళ్తూనే ఏ రకంగా వ్యవహరించాలో పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసింది. టీడీపీ బృందాలు నిజంగా ప్రతి ఇంటికి వెళ్లిందీ లేనిదీ తెలుసుకోవడం కోసం ఒక మిస్డ్‌కాల్ సర్వీస్ ఫోన్ నంబర్ ఏర్పాటు చేశారు. తాము వెళ్లిన ఇంటి వారినుంచి ఆ నంబర్‌కు టీడీపీ బృందాలు ఒక మిస్డ్‌కాల్ చేయిస్తే ఆ ఇంటికి వెళ్లినట్లు పార్టీ అధిష్ఠానానికి తెలుస్తుంది. పార్టీ చెబుతున్న అంశాల పైన ఆసక్తి ఉన్న వారే తమకు మిస్డ్ కాల్ ఇచ్చేందుకు ముందుకు వస్తారనేది టీడీపీ అంచనా. ఆ నెంబర్ల ద్వారా వారితో నిరంతరం స్థానిక నేతలు టచ్ లో ఉండే కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. వారందరినీ తమ ఓట్ బ్యాంకు గా మలచుకొనేందుకు టీడీపీ కార్యాచరణ సిద్దం చేస్తోంది.