అమావాస్య ఘడియతో ఉగాది ఆరంభం?
హిందూ పంచాంగం ప్రకారం, చైత్ర మాసంలోని పాడ్యమి తిథి నాడు చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి. గురువారం నుంచి నవరాత్రులు మొదవుతాయి. ఈ నెల 27వ తేదీన ముగుస్తాయి. పరాభవనామ సంవత్సర ఉగాదితో కలిసి ఛైత్ర నవరాత్రులు ఆరంభం కావడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. 72 సంవత్సరాల తర్వాత ఉగాది, ఛైత్ర నవరాత్రి ఒకేసారి కలిసి వచ్చాయి. దీన్ని అత్యంత అరుదైన పూజా సమయంగా భావిస్తున్నారు.
తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి అమ్మవారిని తొమ్మిది రూపాలను పూజిస్తారు. తద్వారా భక్తులకు అమ్మ ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. శక్తి ఆరాధన, సుఖశాంతులు, శ్రేయస్సు పొందడమే ఈ పండుగ ఉద్దేశం. దేవీ పూజ వల్ల ప్రతికూల శక్తులు నశించి, సానుకూల శక్తి పెరుగుతుందని అశేష భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి పల్లకిపై వస్తుందని ప్రతీతి.

పాడ్యమి తిథి గురువారం అంటే ఈ నెల 19న ఉదయం 6:52 నిమిషాలకు ప్రారంభమై శుక్రవారం తెల్లవారుజామున 4:52 నిమిషాలకు ముగుస్తుంది. అప్పటివరకు అమావాస్య ఘడియలు ఉంటాయి. అమావాస్య ముగిసిన తర్వాతే ఉగాది పండగ పనులు మొదలు పెట్టాలని పెద్దలు చెబుతున్నారు. ఘటస్థాపనకు మొదటి ముహూర్తం 19న తెల్లవారు జామున 6:52 నుంచి 7:43 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:53 వరకు, గోధూళి ముహూర్తం సాయంత్రం 6:35 నుండి 6:59 వరకు ఉంటాయి.
2026 చైత్ర నవరాత్రులు తొమ్మిది రోజులు కొనసాగుతాయి. ఇవి మార్చి 19న ప్రారంభమై, శ్రీరామ నవమితో మార్చి 27న ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవి నవదుర్గా రూపాలను పూజిస్తారు. తేదీలతో సహా నవదుర్గల వివరాలు:
- మార్చి 19 - శైలపుత్రి
- మార్చి 20 - బ్రహ్మచారిణి
- మార్చి 21 - చంద్రఘంట
- మార్చి 22 - కూష్మాండ
- మార్చి 23 - స్కందమాత
- మార్చి 24 - కాత్యాయని
- మార్చి 25 - కాళరాత్రి
- మార్చి 26 - మహాగౌరి (అష్టమి)
- మార్చి 27 - సిద్ధిదాత్రి (శ్రీరామ నవమి)
పూజ విధానం: ఇంటిని, పూజా స్థలాన్ని శుభ్రం చేసి గంగాజలంతో శుద్ధి చేయాలి. పీటపై ఎర్రటి వస్త్రం పరచి, దుర్గాదేవి ప్రతిమ/ఫోటో ప్రతిష్ఠించాలి. అనంతరం కలశ స్థాపన చేయాలి.
మట్టి పాత్రలో బార్లీ గింజలు వేసి, నీటితో నింపిన కలశాన్ని మామిడి ఆకులు, కొబ్బరికాయతో అలంకరించాలి. భక్తులు సంకల్పం చెప్పుకొని వ్రతాలను, పూజలను ప్రారంభిస్తారు. తొమ్మిది రోజులు ప్రతిరోజూ దీపాలు వెలిగించి, ధూపదీప నైవేద్యాలు, పూలు, పండ్లు సమర్పించి దుర్గాదేవి వివిధ రూపాలను పూజించాలి. అలాగే దుర్గా చాలీసా లేదా దుర్గా సప్తశతి పారాయణం చేయాలి.












Click it and Unblock the Notifications