చాణక్య నీతి: ఈ ఐదు లేనిచోటు నివాసయోగ్యం కాదు.. అవేంటో తెలుసుకోండి!!
ఎవరైనా ఎక్కడైనా నివసించవచ్చు. కానీ మన ఎక్కడైనా నివసించాలి అనుకుంటే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం నివసించే చోటు మనకు కావలసిన అన్ని వనరులను సమకూర్చేలా ఉండాలని చెప్తారు. అందుకే అర్ధశాస్త్ర రచయిత అయిన ఆచార్య చాణిక్యుడు మానవ జీవితాన్ని సులభతరం చేయడానికి, అనేక సామాజిక సమస్యల నుండి బయట పడడానికి అనేక నియమాలను పేర్కొన్నారు. అయితే చాలామంది చాణిక్యుడు చేసిన అన్ని సూచనలను పాటించనప్పటికీ ఆయన చేసిన సూచనలలో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయని ఖచ్చితంగా గుర్తిస్తారు.

యోగ్యమైన నివాసస్థలము ఇదేనని చెప్పిన చాణిక్యుడు
ఇక మనం నివసించే ప్రదేశం ఏ విధంగా ఉండాలి అన్న అంశాన్ని చాణిక్యుడు తన ఉద్దేశంలో ఈ విధంగా పేర్కొన్నారు. దీనికోసం ఒక శ్లోకాన్ని చెప్పిన ఆయన ధనిక: శ్రోత్రియో రాజా నదీ వైద్యస్తు పంచమ్... పఞ్చ యత్ర న విద్యన్తే తత్ర దినం న వసేత్ అని పేర్కొన్నారు. ఈ శ్లోకం లోనే మొత్తం అర్థం ఉంది. మనం నివసించే ప్రదేశం లో ధనవంతులు ఉండాలని, పండితులు ఉండాలని, పాలించే పాలకులు ఉండాలని, అనారోగ్యం వస్తే వైద్యం చేసే వైద్యులు ఉండాలని, నదులు ఉండాలని చాణిక్యుడు సూచించారు. ఇవి ఉన్నచోటే యోగ్యమైన నివాసస్థలముగా చాణిక్యుడు పేర్కొన్నారు.

ధనవంతులు లేనిచోటు నివాస యోగ్యం కాదు
ఎవరు ధనవంతులు లేనటువంటి నగరంలో ఉండకూడదని చాణిక్యుడు సూచించాడు. ఎందుకంటే సంక్షోభ సమయంలో ప్రతి ఒక్కరికీ డబ్బు అవసరం ఉంటుంది. ఆ డబ్బు ధనవంతుల వద్ద ఉంటుంది. ఇక ధనవంతులు లేని నగరంలో సంక్షోభం వస్తే తట్టుకునే శక్తి ఎవరికీ ఉండదు. కాబట్టి మనం నివసించే చోట ధనవంతులు కచ్చితంగా ఉండాలి. ఎందుకంటే వారు ఎటువంటి సంక్షోభం అయినా ఎదుర్కొనే ఆర్థిక శక్తిని కలిగి ఉంటారు. అందుకే చాణిక్యుడు మన నివాసం ఉండే చోట కూడా ధనానికి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.

పండితులు లేని చోటు నివాస యోగ్యం కాదు
ఎవరూ పండితులు లేనటువంటి నగరంలో ఉండకూడదని చాణిక్యుడు సూచించాడు. ఎందుకంటే మన ఆచార వ్యవహారాలను సక్రమంగా నిర్వహించడానికి, మనం చనిపోతే కర్మకాండలను నిర్వహించడానికి వేదాలు తెలిసిన పండితులు కావాలి. అటువంటి పండితులు లేనిచోట జీవించడం మంచిది కాదని చాణిక్యుడు చెబుతున్నారు. పండితులు ఉన్నచోట జీవిస్తే కొంతమేరకైనా పాండిత్యం ప్రతిఒక్కరికి అలవడుతుందని చాణిక్యుడు చెబుతున్నాడు. అందుకే పండితులు ఉండాలని సూచించారు. ఇక ప్రస్తుత కాలానికి దీనిని అన్వయించుకుంటే చదువుకున్నవారు ఉన్నచోట, చదువుకు ప్రాధాన్యత ఉండేచోట ఉండడం మంచిది.

పాలన చేసే ప్రభుత్వం లేని చోటు నివాస యోగ్యం కాదు
ఇక ప్రజల పాలన, భద్రత కోసం ఒక ప్రభుత్వం ఖచ్చితంగా అవసరం. అటువంటి ప్రభుత్వం లేని చోట ఉండటం మంచిది కాదని చాణిక్యుడు సూచిస్తున్నాడు. ఎక్కడైనా ప్రజలను పాలించడానికి ఒక ప్రభుత్వం గానీ, ఒక రాజు కానీ ఉండాలి. అటువంటి వ్యవస్థ లేకుంటే అక్కడ జీవితం కష్టంగా ఉంటుందని, అలాంటి చోటు నివాస యోగ్యం కాదని చాణిక్యుడు చెబుతున్నాడు. కాబట్టి మంచి ప్రభుత్వం ఉన్నచోట, సక్రమమైన పాలన ఉన్నచోట నివసించాలని చాణిక్యుడు సూచిస్తున్నాడు.

వైద్యుడు లేని చోటు నివాస యోగ్యం కాదు
వైద్యుడు లేని చోట ఉండటం మంచిదికాదని చాణిక్యుడు చెబుతున్నాడు. ఎందుకంటే మనలో ఎవరికీ ఎప్పుడు అనారోగ్యం వచ్చినా, దాన్ని తగ్గించడానికి వైద్యులు కచ్చితంగా అవసరం. అటువంటి వైద్యులు లేని నగరంలో నివసించడం దుర్భరంగా ఉంటుందని వ్యాధితో బాధపడుతున్నప్పుడు, ఉపశమనం కలిగించే వైద్యులు లేకపోతే అలాంటి చోట నివసించీ ప్రయోజనం ఉండదని చెబుతున్నారు.

నీరు లేని చోటు నివాస యోగ్యం కాదు
ఇక చివరిగా మనం నివసించే చోట నదులు ఉండాలని చాణిక్యుడు సూచిస్తున్నాడు. నదులు లేని ప్రదేశం లో నివసించడం మంచిది కాదని చెబుతున్నారు. నది ప్రవహించని ప్రదేశం ఎప్పుడు నివాస యోగ్యం కాదని సూచిస్తున్నారు. మన జీవితానికి నీటి వనరుల అవసరం ఉంది కాబట్టి, నీటి వనరులను ఇచ్చే నదులు ఉండడం అవసరమని, అలాంటి చోట నివాసం ఉండాలని సూచిస్తున్నారు. చాణిక్యుడు అప్పుడు చెప్పినప్పటికీ ఇప్పటికీ చాణిక్యుడు చెప్పినటువంటి సూత్రాలు ప్రతి ఒక్కరూ ఆలోచించదగినవే.. ఆచరించదగినవే అని చెప్పడం నిర్వివాదాంశం.












Click it and Unblock the Notifications