health tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? వేగంగా బరువు తగ్గాలంటే ఈ ఫుడ్స్ తినండి!!
ప్రస్తుత సమాజంలో అతి పెద్ద సమస్య ఊబకాయం. విపరీతమైన బరువు పెరిగి దాన్ని తగ్గించుకోవడానికి నానా కష్టాలు పడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇక కొంతమంది భోజనం మానేసి పడరాని పాట్లు పడుతున్నారు. అయితే ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే, తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్నిరకాల ఆహార పదార్థాలు బరువు తగ్గడం లో ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్తున్నారు. అందులో కొన్ని ఆహార పదార్ధాలు మనం తెలుసుకుందాం.

బరువు తగ్గాలనుకునేవారు బీన్స్ తింటే మంచిది
ఇక ఆహారం విషయానికి వస్తే బీన్స్ తినడం బరువు తగ్గాలని డైటింగ్ చేస్తున్నవారికి మంచిదని సూచిస్తున్నారు. బీన్స్ లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయని, బీన్స్‌లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. బీన్స్ జీర్ణం కావడానికి నెమ్మదిగా ఉంటుంది. అంటే మీరు ఎక్కువసేపు నిండుగా ఉన్న అనుభూతిని పొందుతారు. ఇది మీరు ఎక్కువ తినకుండా ఆపుతుంది అని వైద్యులు సూచిస్తున్నారు.

బరువు తగ్గాలంటే సూప్స్ బెస్ట్
ఇక బరువు తగ్గాలని భావించేవారు భోజనానికి ముందు ఒక కప్పు సూప్ తాగితే మంచిదని చెబుతున్నారు. ఇక సూప్ లో క్యారెట్, క్యాబేజ్ వంటి కూరగాయలను వేసుకుని చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఒక కప్పు సూప్‌తో భోజనాన్ని ప్రారంభిస్తే తక్కువ భోజనం చేస్తారని, దానివల్ల బరువు తగ్గడానికి వీలవుతుందని చెబుతున్నారు. సూప్ తాగటం వల్ల కడుపు కాస్త తిన్నప్పటికీ నిండుగా ఉంటుంది. అందుకే సూప్ తాగితే కాస్త బరువు తగ్గొచ్చు అంటున్నారు.

కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం తో బరువు తగ్గొచ్చు
మీరు మీ ఆహారంలో మరిన్ని కూరగాయలను ఆహారంగా తీసుకుంటే మంచిదని , తీసుకునే అన్నం కంటే కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి అని చెబుతున్నారు. భోజనాన్ని అలా ప్లాన్ చేసుకుంటే తినే కేలరీలను తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకరమైన కూరగాయలతో బరువును సునాయాసంగా తగ్గొచ్చని సూచిస్తున్నారు.

పండ్ల రసాలతో బరువు తగ్గరు.. నేరుగా పండ్లు తినండి
ఇక పండ్లు తీసుకుంటే కూడా తీసుకునే ఆహారాన్ని తగ్గించవచ్చని చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు పండ్లరసాలు తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు. పండ్లను నేరుగా తీసుకోవడం వల్ల వాటిలో ఉండే ఎక్కువ ఫైబర్ మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, పండ్లను తినడం వల్ల ఇతర ఆహార పదార్థాలను ఎక్కువగా తినకుండా అవుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా పండ్లలో ఆపిల్స్, ద్రాక్ష పండ్లు, బత్తాయి పండ్లు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. కాకుంటే పండ్లను తీసుకునే విషయంలో డయాబెటిస్ లాంటి ఇతర ఆరోగ్య సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెబుతున్నారు.

తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ తో బరువు తగ్గొచ్చు
తృణధాన్యాలు కూడా బరువును తగ్గించడంలో గణనీయమైన పాత్ర పోషిస్తాయని వైద్యులు చెబుతున్నారు. కొర్రలు, సజ్జలు, రాగులు వంటి ధాన్యాలు మాత్రమే కాకుండా బాదం పప్పు, జీడిపప్పు, వేరుశనగపప్పు, వాల్ నట్ లు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అయితే ఏది తీసుకున్నా మితంగా తీసుకోవాలని, అతిగా తీసుకోకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆహార పదార్థాలను మితంగా తీసుకుంటే, ముఖ్యంగా మనం ఖర్చుచేసే కేలరీల కంటే తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారు వ్యాయామంతో పాటుగా, సరైన ఆహార నియమాలు పాటించాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications