9 రోజుల రామేశ్వరం- తిరుపతి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ టూర్..!!
IRCTC: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో ప్యాకేజీని ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు.
ఎనిమిది రాత్రులు/తొమ్మిది పగళ్లు సాగే యాత్ర ఇది. జనవరి 25వ తేదీన ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరుతుంది. సీఎస్టీతో పాటు, థానె, కల్యాణ్, కర్జాత్, లోనావాలా, పుణే, దౌండ్, కుర్దువాడి, షోలాపూర్, కలబురగి స్టేషన్లల్లో హాల్ట్ సౌకర్యం ఉంది.

ఆయా స్టేషన్లల్లో భక్తులు బోర్డింగ్/డీబోర్డింగ్ అయ్యేలా ప్రయాణికులు తమ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీలో కన్యాకుమారి- తిరువనంతపురం- మధురై- రామేశ్వరం- తిరుపతి ఉన్నాయి. కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపం, అక్కడి ఆలయాన్ని సందర్శించవచ్చు.
తిరువనంతపురంలో ప్రఖ్యాత అనంత పద్మనాభ స్వామివారి ఆలయం, కోవలం బీచ్‌ను చూడొచ్చు. రామేశ్వరంలో వెలిసిన శ్రీ రామనాథ స్వామి ఆలయం, మధురైలో మీనాక్షి అమ్మవారి ఆలయం ఈ ప్యాకేజీలో ఉంది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారు, తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడంతో ఈ యాత్ర ముగుస్తుంది.
ఈ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 16,140 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్. థర్డ్ ఏసీ కోసం 29,650 రూపాయలు, సెకెండ్ ఏసీ కోసం 36,120 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.
దేశంలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను అనుసంధానిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ.. భారత్ గౌరవ్ పేరుతో ఈ ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్న విషయం తెలిసిందే. వీటికి ప్రయాణికుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ప్రారంభమైన అన్ని చోట్ల కూడా ప్రయాణికుల ఆదరణ భారీగా ఉంటోంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు జోన్ల వారీగా భారత్ గౌరవ్ ప్రత్యేక రైళ్లను మరింత విస్తృతపరిచారు. వాటి ట్రిప్‌ల సంఖ్యనూ పెంచుతోన్నారు. మున్ముందు విజయవాడ/విశాఖపట్నం నుంచీ ఆయా పుణ్యక్షేత్రాలకు ఈ రైల్ కనెక్టివిటీని కల్పించే దిశగా చర్యలు తీసుకోవచ్చు.












Click it and Unblock the Notifications