జ్వాలాతోరణ సమయంలో ఇలా చేస్తే సర్వ పాపహరణం
Karthika Masam 2024: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. భక్తులతో పోటెత్తుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు. కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలను నిర్వహిస్తోన్నారు. 365 వత్తులతో దీపాలను వెలిగిస్తోన్నారు. దీనివల్ల సర్వదోషాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం.
కార్తీక మాసంలో నదీ/సముద్ర స్నానాలు, వనభోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోన్నారు భక్తులు. నదుల్లో పుణ్యస్నానాలను ఆచరించడం, దైవదర్శనం చేసుకోవడం వల్ల రెట్టింపు ఫలితం కలుగుతుందని నమ్మకం. శైవక్షేత్రాల్లో కార్తీక పురాణాన్ని పారాయణాన్ని పఠిస్తోన్నారు. రోజుకొకటి చొప్పున కార్తీక పురాణంలో ఉండే 30 అధ్యాయాలను పారాయణం చేయడం శుభప్రదంగా భావిస్తారు.

ఈ నెల పొడవునా భక్తులు ఆలయాలను సందర్శిస్తుంటారు. అయ్యప్ప స్వామి భక్తులు మాలధారణ చేసేదీ ఈ మాసంలోనే. శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి శైవక్షేత్రాలన్నీ కార్తీక శోభను సంతరించుకుంటాయి. భక్తులతో పోటెత్తుతుంటాయి. వారణాశి, ఉజ్జయినీ, ఇతర జ్యోతిర్లింగాలను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు.
అన్ని ఆలయాల్లో ఈ సాయంత్రం జ్వాలాతోరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులు 365 వత్తులతో దీపాలను వెలిగించాలని పెద్దలు చెబుతారు. చంద్రోదయం, జ్వాలాతోరణ సమయంలో గుత్తి వత్తులతో దీపాలను వెలగించడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం.
కార్తీకమాసం ఆరంభం నుంచీ శ్రీశైలం కిటకిటలాడుతోంది. ఇక్కడి శ్రీగిరిపై వెలిసిన భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనం కోసం వేలాదిమంది భక్తులు తరలివస్తోన్నారు. వారికోసం ఏపీఎస్ఆర్టీసీ, టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
శ్రీకాళహస్తిలో వెలిసిన శ్రీ జ్జాన ప్రసూనాంబ, శ్రీకాళహస్తీశ్వర్వరుడిని దర్శించుకోవడానికి ఏపీ, తెలంగాణతో పాటు పొరుగునే ఉన్న కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకుంటోన్నారు. స్వర్ణముఖి నదిలో పవిత్ర స్నానాలను ఆచరించి స్వామివారిని దర్శించుకుంటోన్నారు.
తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో శివలింగానికి అన్నాభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు అర్చకులు. తెల్లవారు జామున 2 గంటల నుంచే ఇక్కడ కార్తీక పౌర్ణమి వేడుకలు ఆరంభం అయ్యాయి. సుప్రభాతంతో శివయ్యను మేల్కొలిపారు ఆలయ అర్చకులు. 2:30 నుంచి 4:30 గంటల వరకు అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహించారు.
మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులకు స్వామివారి దర్శనం ఉండదు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన చేపడతారు. శుద్ధి అనంతరం రాత్రి 7.30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.












Click it and Unblock the Notifications