Teachers day 2023: బ్రతుకు నేర్పిన గురువులకు వందనం; టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటామంటే!!
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవేనమః..
అంటే అజ్ఞానం అనే చీకట్లను పారద్రోలి విజ్ఞానం అనే వెలుగులను మన జీవితంలో ప్రకాశింపజేసే గురువుకు నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. ప్రతి ఒక్కరి జీవితంలో విజ్ఞానపు వెలుగులను ప్రకాశింపజేసి, వారికి బతుకుబాట నేర్పేవారు పాఠాలు నేర్పే గురువులు.
గురువు అనుగ్రహం కలిగిన నాడు అజ్ఞాని కూడా విజ్ఞానిగా మారతాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన విజ్ఞానపు వెలుగులను నింపుతున్న టీచర్లను స్మరించుకుంటూ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా టీచర్స్ డే ను అక్టోబర్ 5వ తేదీన జరుపుకుంటే, భారతదేశంలో మాత్రం సెప్టెంబర్ 5వ తేదీన జరుపుకోవడం విశేషం.

సెప్టెంబర్ 5న గురువులకే గురువుగా భావించే సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా టీచర్స్ డే ను నిర్వహించుకుంటున్నాం. అయితే మనం టీచర్స్ డే ను నిర్వహించుకోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశ తొలి ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా పనిచేశారు. భారతరత్న వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డును పొందిన సర్వేపల్లి రాధాకృష్ణన్ కలకత్తా, మైసూర్ యూనివర్సిటీలలో లెక్చరర్ గా పనిచేసి చాలామంది విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దారు.
ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన ఆయన విద్యార్థుల పట్ల అమితమైన ఇష్టాన్ని ప్రదర్శించటమే కాకుండా, గురువుల పట్ల విద్యార్థులు ప్రేమాభిమానాలను కలిగి ఉండాలని విద్యార్థులకు చెప్పేవారిని చెబుతారు. తమ జీవితాన్ని తీర్చిదిద్దిన గురువు సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించాలని విద్యార్థులు ఎన్నిసార్లు అడిగినా వద్దని వారించే వారట. గురువులను గౌరవించాలని విద్యార్థులకు ఆయన పదేపదే చెప్పేవారట.

1962వ సంవత్సరం నుండి సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరపటం ఆయనకు ఇస్తున్న గౌరవంగా మారింది. అప్పటి నుండి అందరూ ఉపాధ్యాయులను గౌరవిస్తూ వేడుకలు చేసుకుంటున్నాము. ఆ మహనీయుని కూడా స్మరించుకుంటున్నాము. గురువుల బాధ్యతను గుర్తు చేస్తూ విజ్ఞానపు వెలుగులను ప్రకాశింప చేసే గురువులను స్మరించుకుంటూ టీచర్స్ డే నిర్వహించడం నాటి నుండి నేటి వరకు ఆనవాయితీగా మారింది. అందుకే మన బ్రతుకు బాట చూపే గురువులకు టీచర్స్ డే సందర్భంగా శిరస్సు వంచి ప్రణామం చేయాల్సిందే!!












Click it and Unblock the Notifications