ఎన్టీఆర్, పవన్ సినిమాలు ఒకే రోజు వస్తే.. ఫస్ట్ ఆ మూవీనే చూస్తా - నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి తన ప్రత్యేక శైలితో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. యువతకు మరింత దగ్గరయ్యేందుకు ఆయన ఇటీవల 'జెన్ జీ' (Gen Z) స్టైల్‌లో నిర్వహించిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. సాధారణ రాజకీయ ఇంటర్వ్యూలకు భిన్నంగా సాగిన ఈ చిట్‌చాట్‌లో రాజకీయాల నుంచి సినిమాలు, వ్యక్తిగత అభిరుచులు, కుటుంబం, భవిష్యత్ రాజకీయాల వరకు అనేక అంశాలపై లోకేష్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. సదరు ప్రశ్నలకు ఆయన ఎంతో హుందాగా, తెలివిగా సమాధానాలు ఇవ్వడం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
ఎన్టీఆర్, పవన్ సినిమాల్లో ఏది చూస్తారు?
ఇంటర్వ్యూలో భాగంగా "ఒకే రోజు జూనియర్ ఎన్టీఆర్ సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైతే మీరు ముందుగా ఏ సినిమా చూస్తారు?" అని ప్రశ్నించగా లోకేష్ చిరునవ్వుతో స్పందించారు. "రెండు సినిమాలు ఒకే రోజు చూస్తాను" అని చెప్పి ఇద్దరు హీరోల అభిమానులను సంతృప్తిపరిచేలా సమాధానం ఇచ్చారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా ఎవరికీ ప్రాధాన్యం ఇవ్వకుండా, ఇద్దరిపైనా సమాన గౌరవం చూపిన తీరు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.

చంద్రబాబు ప్రధాని కావాలా? రాష్ట్రపతి కావాలా?
ఇంటర్వ్యూలో మరో ఆసక్తికరమైన ప్రశ్న నారా చంద్రబాబు నాయుడి గురించి వచ్చింది. "చంద్రబాబు నాయుడు దేశ ప్రధాని కావాలని అనుకుంటారా? లేక రాష్ట్రపతి కావాలని కోరుకుంటారా?" అని అడగ్గా లోకేష్ ఊహించని సమాధానం చెప్పారు. ఆ రెండు పదవులు కూడా అవసరం లేదని, చంద్రబాబు నాయుడు అమరావతిలోనే ఉండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేయాలని తాను కోరుకుంటానని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధే తన తండ్రి ప్రధాన లక్ష్యమని, నవ్యాంధ్ర నిర్మాణం పూర్తయ్యే వరకు ఆయన రాష్ట్రానికే సేవ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.
బిర్యానీ కంటే రాగి సంగటికే ఓటు..
అలానే ఆహారపు అలవాట్ల గురించి కూడా లోకేష్ ఓపెన్ అయ్యారు. హైదరాబాద్ బిర్యానీ ఇష్టమా? లేక రాయలసీమ ప్రత్యేక వంటకం రాగి సంగటి ఇష్టమా? అని అడగ్గా.. లోకేష్ ఎలాంటి సందేహం లేకుండా రాగి సంగటికే తన ఓటు వేశారు. స్థానిక సంప్రదాయ ఆహారాన్ని తాను ఎక్కువగా ఇష్టపడతానని, ఆరోగ్యానికి కూడా అలాంటి ఆహారమే మంచిదని పేర్కొన్నారు. దీంతో రాయలసీమ ప్రజలు కూడా సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Fun questions 😄💥🔥
— SBS (@SBSUSA007) June 29, 2026
Hyderabad or Amaravati?
NTR vs Pawan 😅
నారా లోకేష్ గారితో ఫన్ టైం. pic.twitter.com/U6JMt1ucRg
2029 ఎన్నికలపై ధీమా..
రాజకీయాల గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో ప్రశ్నలు వచ్చాయి. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయని అడగ్గా, నారా లోకేష్ పూర్తి విశ్వాసంతో సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి మళ్లీ ప్రజల మద్దతుతో అధికారంలోకి వస్తుందని, గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే తమ విజయానికి కారణమవుతాయని అన్నారు.












Click it and Unblock the Notifications