Ginger Price: అల్లం, కొత్తిమీర..పెరిగిన కూరగాయల తాజా ధరలు..!
హైదరాబాద్ : టామాటాతో కూడిన వంటలు సంతృప్తిగా తినాలంటే సామాన్యుడికి కుదరడం లేదు. కారణం టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోవడమే. త్వరలోనే టమాటా ధర తగ్గుముఖం పడుతుందనే వార్తలు వస్తున్నప్పటికీ అది ఇప్పట్లో సాధ్యపడే విషయం కాదన్నది నగ్న సత్యం. ఇక టమాటా ఒక్కటే కదా మిగతా కూరగాయలతో సరిపెట్టుకుందాంలే అనుకునే సామాన్యుడికి మరో పిడుగులాంటి వార్త వచ్చి పడింది. టమాటాతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయి.
టమాటా ధరలు భారీగా పెరిగడంతో దాని ప్రభావం ఇతర కూరగాయలపై కూడా క్రమంగా పడుతోంది. దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో చాలావరకు కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి. వర్షం కారణంగా పంట ధ్వంసం కావడంతో రైతులకు కన్నీళ్లు మిగులుతున్నాయి. ఇక పంట పుష్కలంగా లేకపోవడంతో ధరలు కూడా పెరుగుతున్నాయి.దీంతో సామాన్యుడి వంటింటి బడ్జెట్ పెరుగుతోంది.

సాధారణంగా ఉచితంగా లభించే కొత్తిమీర ధర కిలో రూ.200 పలుకుతోంది.ఇక అల్లం సంగతైతే చెప్పక్కర్లేదు. కిలో రూ.250 నుంచి రూ. 300వరకు ఉంది. వెల్లుల్లి కిలో రూ.200 ఉండగా, బీన్స్ కూడా కిలో రూ.160 మార్క్ దాటింది. పచ్చి మిర్చి కిలో రూ.100 నుంచి రూ.120 వరకు మంటపుట్టిస్తోంది. ఒకప్పుడు టమాటా ధర రూ.200కు ఉండగా ఇది క్రమంగా రూ.150కి చేరింది. ఏప్రిల్-మే నెలలతో పోలిస్తే ధర మాత్రం మూడు రెట్లు అధికంగానే ఉంది.
ధరలు ఆకాశాన్నంటుతుండటంతో మధ్య తరగతి ప్రజలు టామాటా మాటే ఎత్తడం లేదు. అంతేకాదు టమాటాను కొనే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. కూరగాయల ధరల ఎఫెక్ట్ పండ్లపై కూడా పడుతోంది. ఒకప్పుడు బాక్స్ యాపిల్స్ ధర రూ.1200 నుంచి రూ.1500 ఉండగా ఇప్పుడది రూ. 2200కు చేరింది. ఇక వర్షాలు కురుస్తుండటంతో రవాణా వ్యవస్థ దెబ్బతింది. దక్షిణ భారతదేశం నుంచి కూరగాయల సరఫరా క్రమంగా తగ్గుతోంది.ఇక ఇది ఇలానే కొనసాగితే ధరల పెరుగుదల ఇంకా ఎక్కువగానే ఉండొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications