RK Roja : ఎమ్మెల్సీ పోరులో టీడీపీ గెలుపుకు కారణాలివే ! తేల్చిచెప్పేసిన ఆర్కే రోజా ...
ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సాధించిన విజయంపై వైసీపీ, టీడీపీ మధ్య మాటలయుద్ధం సాగుతోంది.
గుంటూరు : ఏపీలో తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సాధించిన విజయాలు రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి. ఈ విజయాలతో టీడీపీ సంబరాలు జరుపుకుంటోంది. దీనిపై పర్యాటక మంత్రి ఆర్కే రోజా ఇవాళ స్పందించారు. గుంటూరులో వైసీపీ నేత తాడిశెట్టి మురళిని ఆర్కే రోజా, నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లు ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు, డొక్కా మాణిక్యవరప్రసాద్, జంగాకృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు నంబూరు శంకర్రావు, ముస్తఫా,జియావుద్దీన్ ఇవాళ కలిశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామన్నా శునకానందం ఇంకొకటి ఉండదంటూ టీడీపీ తీరుపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు.
గెలిచామని సంబరాలు చేసుకోవటం సిగ్గు చేటన్నారు. సైకిల్ గుర్తుపై ఓటర్లు ఓటు వేయలేదని, వైసీపీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి సారి పోటీ చేసిందని గుర్తుచేశారు. వైజాగ్ అభ్యర్థి చిరంజీవి రావు ఇండిపెండెంట్ గా పోటీ చేసినా మంచి ఓట్లే వచ్చేవన్నారు. టీడీపీ వారు ఆయన్ను కాళ్ళు గడ్డాలు పట్టుకొని తమ వైపుకు తిప్పుకున్నారన్నారు.

వైసీపీపై టీచర్స్ వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం చేశారని టీడీపీ నేతలపై రోజా మండిపడ్డారు. టీచర్స్ ఎమ్మెల్సీ ల్లో వైసీపీనే గెలిచిందన్నారు. టీచర్లను భయపెట్టి ఓట్లు వేయించుకోవడానికి వాళ్ళేమీ చిన్న పిల్లలు కాదని, మేధావులు ఎందుకు ఓటు వేశారో టీడీపీ వాళ్ళు రెండు కారణాలు చెప్పాలని రోజా అడిగారు. సింబల్ పై జరిగే ఏ ఎన్నికల్లో అయినా వైసీపీదే గెలుపని రోజా జోస్యం చెప్పారు. ఎమ్మెల్సీ పోరులో టీడీపీ తాజా విజయాలు శాశ్వతం కాదని రోజా తెలిపారు.












Click it and Unblock the Notifications