వీడు భర్తేనా: ప్రేమించి పెళ్లాడిన భార్యకు హెచ్ఐవీ ఇంజెక్షన్, స్లోపాయిజన్
గుంటూరు: జిల్లాలోని తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు ఓ ఆర్ఎంపీ సాయంతో హెచ్ఐవీ ఇంజెక్షన్ ఇప్పించాడు భర్త. మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న నిందితుడు.. తన భార్యను ఎలాగైనా వదిలించుకునేందుకు ఈ ఘోరానికి తెగబడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

ప్రేమించి పెళ్లాడి.. మరో యువతితో..
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బాధితురాలు మమతను నిందితుడు ఎం చరణ్ కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వివాహం తర్వాత కొంత కాలం వరకు ఇద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. ఆ తర్వాత విశాఖపట్నంకు చెందిన ఓ యువతితో తన భర్తకు వివాహేతర సంబంధం ఏర్పడిందని బాధితురాలు ఆరోపించింది. ఈ క్రమంలోనే తనను అదనపు కట్నం కోసం వేధించాడని తెలిపింది. ఆ తర్వాత తనను వదిలించుకునేందుకు ప్లాన్ వేశాడని పేర్కొంది.

భార్యకు హెచ్ఐవీ ఇంజెక్షన్ ఎక్కించాడు
ఈ క్రమంలోనే బలానికి మందులు అని చెప్పి.. ఓ ఆర్ఎంపీ సాయంతో తనకు హెచ్ఐవీ ఇంజెక్షన్ వేయించాడని మమత ఫిర్యాదులో తెలిపింది. దీంతో తనకు ఎయిడ్స్ పాజిటివ్ వచ్చిందని.. ఎలా బతకాలని.. తనకు న్యాయం చేయాలని తాడేపల్లి పోలీసులను కోరింది. ఆమె ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు, ఆమె భర్త చరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మమతను వదిలించుకునేందుకే హెచ్ఐవీ ఇంజెక్షన్, స్లోపాయిజన్
కాగా, ఇప్పుడు మమత గర్భవతి. హెచ్ఐవీ గురించి భర్తను మమత ప్రశ్నించగా.. ప్రెగ్నన్సీ సమయంలో అంగన్వాడీలో వ్యాక్సిన్ చేశారని, దాని వల్లే హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిందని అతడు చెప్పాడని తెలిపింది. అయితే, తనకు ఓ ఆర్ఎంపీ సాయంతో పలు దఫాలుగా హెచ్ఐవీ ఇంజెక్షన్లు వేయించాడని మమత వాపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. చరణ్ మరో యువతి కోసం ఇలా తనను మోసం చేశాడని కన్నీటిపర్యంతమవుతోంది మమత. అయితే, హెచ్ఐవీతోపాటు ఆమెకు స్లోపాయిజన్ కూడా భర్త ఎక్కించినట్లు సమాచారం. భార్యకు విడాకులిచ్చి వదిలించుకునేందుకే చరణ్ ఇంత ఘోరానికి తెగబడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications