అనూహ్య పరిణామం..! వైసీపీని వీడి బీజేపీలో చేరిన గుంటూరు ముస్లిం కీలక నేత..!
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బీజేపీలో చేరేందుకు ఇతర కులమతాల నేతలే సందేహిస్తున్న వేళ.. గుంటూరుకు చెందిన వైసీపీ మైనార్టీ నేత ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.
విజయవాడ: ఏపీలో ప్రస్తుతం వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయాలే సాగుతున్నాయి. వీరిద్దరి మధ్యసాగుతున్న పోరులో మూడో పక్షాన్ని ఓటర్లు పట్టించుకునే పరిస్ధితి లేదని తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం నిరూపించాయి. బీజేపీ అయితే మరోసారి డిపాజిట్లు కూడా కోల్పోయింది. ఇలాంటి తరుణంలో అధికార వైసీపీకి చెందిన ఓ రాష్ట్రస్ధాయి నేత ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు.
గుంటూరు వైసీపీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ చాంద్ బాషా ఇవాళ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు సమక్షంలో ఆయన కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి నేరుగా వచ్చి పార్టీ తీర్ధం తీసుకున్నారు.

గుంటూరు లో మున్సిపల్ కౌన్సిలర్ గా, కార్పోరేటర్ గా పనిచేసిన ఛాంద్ బాషా కాంగ్రెస్ లో పీసీసీ కార్యదర్శిగా, మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. అనంతరం వైసీపీలో మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
బీజేపీలో చేరికను చాంద్ బాషా సమర్ధించుకున్నారు. బీజేపీ ముస్లింలకు రక్షణ కల్పించడమే కాదు సంక్షేమం అమలు చేస్తోందన్నారు . భారత ప్రధాని నరేంద్రమోదీ పాలనపట్ల ఆకర్షితులయ్యానన్నారు. సోమువీర్రాజు గారి నాయకత్వంలో రాష్ట్రంలో బిజెపి బలోపేతానికి కృషిచేస్తానన్నారు. ఏపీ బీజేపీలో ముస్లిం నేతల సంఖ్య చాలా తక్కువగానే ఉన్న తరుణంలో వచ్చే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని మైనారిటీలో ఎక్కువగా ఉన్న గుంటూరువంటి ప్రాంతానికి చెందిన నేత బీజేపీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications