ఐపీఎల్ మ్యాచ్ లతో జగన్, ప్రజల ప్రాణాలు గాల్లో.. పరీక్షల రద్దుపై 'కంస మామ' : లోకేష్ ఫైర్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసి పోతుంటే, సీఎం జగన్ మాత్రం ఐపీఎల్ మ్యాచ్ లు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారని నారా లోకేష్ మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి గారు పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ కబుర్లు మాని ప్రజల ఆరోగ్యం పై దృష్టి సారిస్తే బాగుంటుందని జగన్ కు సూచించారు లోకేష్.

తాడేపల్లి నివాసంలో సీఎం జగన్ ఐపీఎల్ మ్యాచ్లు మిస్సవకుండా చూస్తున్న జగన్
ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి, కానీ తాడేపల్లి నివాసంలో సీఎం జగన్ ఐపీఎల్ మ్యాచ్లు మిస్సవకుండా చూస్తున్నారని ఎద్దేవా చేసిన లోకేష్ విజయనగరం మహారాజ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఐదుగురు చనిపోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని వెల్లడించారు. అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని నారా లోకేష్ తేల్చి చెప్పారు. మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన లోకేష్, ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వస్తే వాస్తవాలు తెలుస్తాయని ఎద్దేవా
రాష్ట్రంలో పరిస్థితులు ప్రతిపక్షం నిత్యం తెలియజేస్తున్నా, ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదని లోకేష్ మండిపడ్డారు. ఆస్పత్రిలో బెడ్లు లేక, ఆక్సిజన్, మందులు అందక ప్రజలు నరకయాతన అనుభవిస్తూ ఉంటే జగన్ రెడ్డికి మాత్రం అవేవీ పట్టడం లేదన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వస్తే వాస్తవాలు తెలుస్తాయని ఎద్దేవా చేసిన లోకేష్ , రాష్ట్రంలో ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో తక్షణమే బెడ్లు, ఆక్సిజన్ మరియు మందుల కొరత లేకుండా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించటం పై సీఎం జగన్ దృష్టి సారించాలన్నారు.

పరీక్షలు రద్దు చేసి మంచి మేనమామ అనిపించుకుంటారో .. కంస మామా అనిపించుకుంటారో
అంతేకాదు రాష్ట్రంలో టెన్త్ ఇంటర్ పరీక్ష వాయిదా పై, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఏపీలో 20 నిమిషాలకు ఒకరు కరోనా మహమ్మారి కారణంగా మరణిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే వంద మంది టీచర్లు కరోనాతో చనిపోయారని, పరీక్షలు వాయిదా పై ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విషయాన్ని గవర్నర్ కు లేఖ రాసినట్లుగా లోకేష్ వెల్లడించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇకనైనా ఇగో ని వదిలి పెట్టాలని హితవు పలికారు. పరీక్షలు రద్దు చేసి మంచి మేనమామ అనిపించుకుంటారో .. కంస మామా అనిపించుకుంటారో జగన్ ఇష్టం అంటూ లోకేష్ పేర్కొన్నారు.

పది, ఇంటర్ పరీక్షలు రద్దు కు రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరుతూ లోకేష్ లేఖ
రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు కు రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. రాష్ట్రంలో 16.3 లక్షల మంది ఇంటర్ పదో తరగతి పరీక్షలకు హాజరు కావాల్సి ఉందని, కరోనా రెండోదశ తీవ్రత దృష్ట్యా పరీక్షల నిర్వహణ విద్యార్థులకు ప్రాణసంకటంగా మారుతుందని తన లేఖలో లోకేష్ పేర్కొన్నారు. దేశంలో దాదాపు ఇరవై రాష్ట్రాలు విద్యార్థులకు పరీక్షలను వాయిదా వేయడం లేదా రద్దు చేయడం చేశాయని, ఇందుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించాలి అనుకోవడం కరోనా మహమ్మారిని వ్యాప్తి చేయడమేనని లోకేష్ తన లేఖలో స్పష్టం చేశారు.

టీడీపీ అభిప్రాయ సేకరణలో పరీక్షల రద్దుకే విద్యార్థులు తల్లిదండ్రులు మొగ్గు
ఏ ఒక్క విద్యార్థి కరోనా బారిన పడి చనిపోయినా, అది క్షమించరాని నేరమవుతుంది పేర్కొన్న లోకేష్, పరీక్షల నిర్వహణపై తెలుగుదేశం పార్టీ ప్రజాభిప్రాయ సేకరణ చేసిందని, పరీక్షల నిర్వహణ వద్దంటూ తమ ఉద్యమానికి మద్దతు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రకటించారని స్పష్టం చేశారు. కరోనాను అదుపు చేసే చర్యలు తీసుకోకపోగా విస్తృతికి మరింత అవకాశం కల్పించే నిర్ణయాలను తీసుకోవడం దారుణమన్నారు లోకేష్. గవర్నర్ తనకున్న విశేష అధికారులతో పరీక్షల నిర్వహణపై జోక్యం చేసుకోవాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications