అమరావతికి కొత్త పేరు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే: బహుజన అమరావతిగా.. !
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజధాని ప్రాంతానికి సరికొత్త నామకరణం చేశారు. అమరావతిని బహుజన అమరావతిగా పేరు పెట్టారు. రాజధాని నిర్మాణానికి రైతులు ఇచ్చిన భూములను పేదలకు పంచడానికి ఉద్దేశించిన జీవోను తీసుకుని రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సొంత ఇళ్లు లేని నిరుపేదల కోసం 1251 ఎకరాల భూమిని పంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు.
బుధవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అమరావతి నిర్మాణానికి రైతులు ఇచ్చిన భూములు చంద్రబాబు హయాంలో నిరుపయోగంగా ఉన్నాయని విమర్శించారు. తాజాగా- సచివాలయాన్ని విశాఖపట్నానికి, హైకోర్టును కర్నూలుకు తరలించడం వల్ల 33 వేల ఎకరాల్లో అమరావతిని నిర్మించాల్సిన అవసరం లేదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనని అన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో భూములు మరోసారి నిరుపయోగంగా మారిపోయే అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని సొంత ఇంటి కోసం నిరుపేదలకు వాటిని పంచి పెట్టడంలో తప్పు లేదని అన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల అమరావతి బహుజన అమరావతిగా, సర్వజన అమరావతిగా విరాజిల్లుతుందని చెప్పారు. అమరావతి ప్రాంతంలో వంద అడుగుల ఎత్తులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా నిర్మించాలని తాను ముఖ్యమంత్రిని కోరుతున్నానని ఆళ్ల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఈ విగ్రహాన్ని నిర్మించడానికి ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టినప్పటికీ..అది కాగితాలకే పరిమితమైందని విమర్శించారు.
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని తెలుగుదేశం తప్పు పట్టడం.. ఆ పార్టీ ద్వంద్వ విధానానికి నిదర్శనమని ఆరోపించారు. పేదలను ఉద్ధరిస్తామంటూ టీడీపీ నాయకులు చేసే ప్రకటనలు కార్యాచరణల్లోకి ఎప్పుడూ మారబోవని అన్నారు. 52 వేల మందికి అమరావతిలో ఇళ్ల స్థలాన్ని కేటాయించడానికి టీడీపీ నాయకులు ఎందుకు తప్పు పడుతున్నారని ప్రశ్నించారు. తమ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే నివసించాలని వారు కోరుకుంటున్నారా? అని నిలదీశారు.
Recommended Video













Click it and Unblock the Notifications