చంద్రబాబు వేలికి చిప్ ఎందుకు ఉందో వెల్లడించిన సాయిరెడ్డి: ఆయనది నార్సిస్టిక్ పర్సనాలిటీ
అమరావతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా నిర్వహించిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ విజయవంతమైనట్లు రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి చెప్పారు. వైసీపీ ప్లీనరీ చరత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఒక ఉప్పెనలా, మహా సముద్రంలో అభిమానులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు ప్లీనరీకి వచ్చారని చెప్పారు.

జడివాననూ లెక్కచేయలేదు..
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముగింపు ప్రసంగాన్ని వినడానికి లక్షలాది సంఖ్యలో హాజరయ్యారని అన్నారు. జడివానను సైతం ప్రజలు లెక్కచేయలేదని, తమ ప్రభుత్వం మీద వారికి ఉన్న అభిమానానికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై ప్రజల్లో చెక్కు చెదరని విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ప్లీనరీ ప్రాంగణంలో అయిదు లక్షల మంది, రోడ్ల మీద మరో నాలుగు లక్షల మంది ఉన్నారని అన్నారు.

జనం లేదంటూ దుష్ప్రచారం..
జనం లేక వైసీపీ ప్లీనరీ వెలవెలబోయిందంటూ- తెలుగుదేశం పార్టీకి కరపత్రికగా మారిన ఓ మీడియా, ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాత్రమే విమర్శించారని చెప్పారు. ఆ మీడియాధినేత, రఘురామ కృష్ణంరాజు కళ్లుండి కూడా చూడలేని విధంగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. చివరికి ఈనాడు కూడా యదార్థాన్ని రాసిందని సాయిరెడ్డి చెప్పారు. ఇలా దుష్ప్రచారాన్ని చేయడంలో విగ్గు రాజుకు ఎదురు లేదంటూ ఎద్దేవా చేశారు.

నవరంధ్రాలు మూసుకునేలా..
తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న నవ రత్నాలను విమర్శించిన తెలుగుదేశం, ఇతర పార్టీ నాయకుల నవరంధ్రాలు మూతపడ్డాయని విజయసాయి రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఈ ప్లీనరీ విజయవంతం కావడం వల్ల చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్‌లో కూరుకుపోయాడని మండిపడ్డారు. శాడిస్ట్, సైకోపాథ్‌లా ప్రవర్తిస్తున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు తన హయాంలో చేసిన దోపిడీ అనుకూల మీడియా కంటికి కనిపించలేదా? అని ప్రశ్నించారు.

అతిపెద్ద కుంభకోణం..
అమరావతి అనేది ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం అని సాయిరెడ్డి ధ్వజమెత్తారు. అమరావతి కోసం ఎంత ఖర్చు పెట్టారు?.. భూములను ఎవరికి తాకట్టు పెట్టారనే వివరాలను ఇవ్వడని అన్నారు. తన దృష్టిలో చంద్రబాబుది నార్సిస్టిక్ పర్సనాలిటీ అని చురకలు అంటించారు. మెదడులో ఉండాల్సిన చిప్.. ఇప్పుడు వేలికి వచ్చిందని, అది క్రమంగా మోకాలికి, ఆ తరువాత అరికాలికి చేరుతుందని, అనంతరం భూమిలోకి పడిపోతుందని చెప్పారు.

175 గెలవడమే లక్ష్యంగా..
రాష్ట్రంలో గల 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటామని సాయిరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ ఒంగోలులో నిర్వహించిన మినీనాడుకు, తమ ప్లీనరీకి బేరీజు వేసుకుని చూడాలని ఆయన సూచించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తొమ్మిది లక్షల మంది ప్లీనరీకి హాజరయ్యారని, చివరి రోజు వైఎస్ జగన్ ప్రసంగం వినడానికి వచ్చిన అభిమానుల సంఖ్య తొలి రోజు కంటే ఎక్కువగా ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications