చిల్లర డబ్బుల కోసం ఒళ్ళు గగుర్పొడిచేలా 15 రోజుల్లో 3 హత్యలు; హైదరాబాద్ లో సైకో కిల్లర్ అరెస్ట్
హైదరాబాద్లో పోలీసులను పరేషాన్ చేసిన వరుస హత్యల కేసును ఎట్టకేలకు హైదరాబాద్ నగర పోలీసులు ఛేదించారు. కేవలం చిల్లర డబ్బుల కోసం ప్రజల ప్రాణాలు తీస్తున్న సైకో కిల్లర్ ను అరెస్టు చేసిన హైదరాబాద్ నగర పోలీసులు అతనిని రిమాండ్ కు తరలించారు. గత పదిహేను రోజుల్లో ముగ్గురిని హతమార్చింది ఓ సైకో కిల్లర్ అని గుర్తించిన పోలీసులు, అతన్ని అరెస్ట్ చేయడంతో కాస్త రిలీఫ్ అయ్యారు.
చిల్లర డబ్బుల కోసం వరస హత్యలు చేసిన సైకో కిల్లర్
అసలు ఇంతకీ ఏం జరిగిందంటే హైదరాబాద్ నగరంలో అక్టోబర్ 15వ తేదీన ముర్గి మార్కెట్ పరిధిలో బిచ్చగాడు నిద్రిస్తుండగా అతని జేబులో నుండి చిల్లర డబ్బులు దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు సైకో కిల్లర్ ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో తోపులాట జరగగా బిచ్చగాడిని బలంగా నెట్టి వేయడంతో వెన్నుపూస విరిగి బిచ్చగాడు మృతి చెందాడు. ఆ తర్వాత సైకో కిల్లర్ అతనిదగ్గర ఉన్న చిల్లర డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్టోబర్ 31వ తేదీన అర్ధరాత్రి మద్యం మత్తులో ఖదీర్ ఓ వ్యక్తి దగ్గరికి వెళ్లి ముందుగా అగ్గిపెట్టె అడిగాడు. ఆ తర్వాత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో అక్కడే ఉన్న సిమెంట్ దిమ్మతో ఆ వ్యక్తి తలపై మోదాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగే అతను అక్కడికక్కడే మరణించాడు.

తన మాట వినకుంటే హతమారుస్తున్న సైకో
అనంతరం మృతుడి జేబులో ఉన్న వంద రూపాయలతో పాటు ఓ మద్యం సీసా తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. ఇక హత్యల పరంపరను కొనసాగిస్తున్న సైకో కిల్లర్ అదే రోజు నాంపల్లిలో తనకు తెలిసిన ఖాజా అనే డ్రైవర్ దగ్గరకు వెళ్ళాడు. ఆటోలో పడుకోవడానికి చోటు ఇవ్వాలని అడిగాడు. అందుకు ఆటోడ్రైవర్ నిరాకరించడంతో రాయితో అతడి తలపై బలంగా మోది డ్రైవర్ ను హతమార్చాడు. హైదరాబాద్ నగరంలో సంచలనంగా వరుస హత్యలు నమోదు కావడంతో, ఈ హత్యలపై ఫోకస్ చేసిన హైదరాబాద్ పోలీసులు ఇదంతా చిల్లర డబ్బుల కోసం సైకో చేసిన పనిగా గుర్తించారు.
15 రోజుల్లో ముగ్గురు వ్యక్తుల హత్యలు .. సైకో కిల్లర్ అరెస్ట్
15 రోజుల్లో ముగ్గురు వ్యక్తులను హతం చేయడంపై దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు ఎట్టకేలకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న ఖదీర్ అనే సైకో కిల్లర్ ను నాంపల్లి లోని ఓ హోటల్ వద్ద గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో నగరంలో జరిగిన మూడు హత్యల మేటర్ బయటకు వచ్చింది. ప్రస్తుతం సైకో కిల్లర్ ఖదీర్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు.ఖదీర్ విషయానికి వస్తే చిన్నతనంలో తండ్రి వేధింపులు భరించలేక ఇంటినుంచి పారిపోయిన వ్యక్తి ఖదీర్. చెడు అలవాట్లకు బానిసై, తన అవసరాల కోసం హత్యలకు కూడా వెనుకాడకుండా సైకో గా మారినట్లుగా పోలీసులు తెలిపారు.
కర్ణాటక నుండి హైదరాబాద్ వచ్చి సైకోగా మారిన వ్యక్తి .. అర్ధరాత్రుల్లో క్రిమినల్ గా
పెళ్లై ఐదుగురు పిల్లలున్నా ఖదీర్ వాళ్లను వదిలి పెట్టి కర్ణాటక రాష్ట్రం నుండి హైదరాబాద్ నగరానికి వచ్చి సైకో కిల్లర్ గా మారాడు. రాత్రిపూట నాంపల్లిలోని ఏక్ మినార్ వద్ద ఫుట్ పాత్ పై నిదురిస్తూ జీవనం సాగిస్తున్న ఖదీర్ నగరంలో అర్ధరాత్రులు సంచరిస్తూ కనిపించిన వారిని బెదిరిస్తూ,డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను తన మాట వినని వాళ్లను, డబ్బులు ఇవ్వని వాళ్లను అత్యంత దారుణంగా హతమారుస్తున్నాడు .ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఇప్పటివరకు ముగ్గురిని కేవలం చిల్లర డబ్బుల కోసం హతమార్చినట్లు పోలీసులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications