తెలంగాణలో కొత్తగా 324 కరోనా కేసులు: ఆ నాలుగు జిల్లాల్లో కొత్త కేసుల్లేవ్, 2 కోట్లు దాటిన టీకా పంపిణీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఒక్కోరోజు కేసులు స్వల్పంగా పెరగడం, తగ్గడం జరుగుతోంది. గత 24 గంటల్లో 73,323 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 324 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది.

తెలంగాణలో కొత్తగా 324 కరోనా కేసులు, ఒకరు మృతి
తాజాగా, నమోదైన 324 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,62,526కు చేరింది. కరోనాతో కొత్తగా ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3899కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 2062 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

తెలంగాణలో 5325 యాక్టివ్ కేసులు
గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 280 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,53,302కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,891 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.51 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 04, భద్రాద్రి కొత్తగూడెంలో 05, జీహెచ్ఎంసీలో 79. జగిత్యాలలో 11, జనగామలో 09, జయశంకర్ భూపాలపల్లిలో 04, జోగులాంబ గద్వాలలో 00, కామారెడ్డిలో 02, కరీంనగర్‌లో 22, ఖమ్మంలో 24, కొమురంభీం ఆసిఫాబాద్ లో 00, మహబూబ్‌నగర్‌లో 05, మహబూబాబాద్‌లో 07, మంచిర్యాలలో 08, మెదక్‌లో 03, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 15, ములుగులో 00, నాగర్ కర్నూలులో 04, నల్గొండలో 19, నారాయణపేటలో 00 నిర్మల్‌లో 02, నిజామాబాద్‌లో 03, పెద్దపల్లిలో 12, రాజన్న సిరిసిల్లలో 11, రంగారెడ్డిలో 18, సంగారెడ్డిలో 06, సిద్దిపేటలో 08, సూర్యాపేటలో 07, వికారాబాద్ లో 04, వనపర్తిలో 04, వరంగల్ రూరల్‌లో 10, వరంగల్ అర్బన్‌లో 12, యాదాద్రి భువనగిరిలో 06 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో జోగులాంబ గద్వాల్, కొమరంభీం అసిఫాబాద్, ములుగు, నారాయణపేట్ జిల్లాలో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

తెలంగాణలో 2 కోట్ల మందికి వ్యాక్సిన్ డోసు పూర్తి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ప్రత్యేక కేంద్రాల ద్వారానే కాకుండా, మొబైల్ సెంటర్ల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తోంది. బుధవారం నాటికి రాష్ట్రంలో 2 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. ఈ సందర్భంగా తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కేక్ కట్ చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు, సిబ్బందిని సీఎస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఓఎస్‌డీ గంగాధర్, వైద్య శాఖ సంచాలకులు జీ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు ప్రతిరోజు 3 లక్షల మందికి టీకాలు ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన వారు 2.80 కోట్ల మంది ఉన్నారని, ఇందులో ఇప్పటివరకు 1.45 కోట్ల మంది మొదటి డోసు తీసుకున్నారు. 55 లక్షల మంది రెండో డోసు తీసుకున్నారనీ సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.












Click it and Unblock the Notifications