బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం: 18 గంటలపాటు లాకర్ గదిలోనే 84 ఏళ్ల వృద్ధుడు
హైదరాబాద్: ఓ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 84 ఏళ్ల వృద్దుడు బ్యాంక్ లాకర్‌లోనే 18 గంటలపాటు ఉండిపోవాల్సి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంక్‌లో చోటు చేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 67లో 84 ఏళ్ల వ్యాపారి కృష్ణారెడ్డి నివాసముంటున్నారు. ఆయన సోమవారం సాయంత్రం 4.20 గంటలకు బ్యాంక్ లాకర్ పని మీద జూబ్లీహిల్స్ చెక్ పోస్టులోని యూనియన్ బ్యాంక్ కు వెళ్లారు.

అయితే, లాకర్ గది లోపల కృష్ణారెడ్డి ఉండగానే సిబ్బంది గమనించకుండా దాన్ని మూసివేయడంతో ఆయన రాత్రంతా అందులోనే గడపాల్సి వచ్చింది. బ్యాంకుకు వెళ్లిన కృష్ణారెడ్డి ఎప్పటికీ ఇంటికి తిరిగిరాకపోవడంతో ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో మంగళవారం ఉదయం పోలీసులకు అనుమానం వచ్చి సీసీ ఫుటేజీలున పరిశీలించగా.. బ్యాంక్ లాకర్ గదిలో కృష్ణారెడ్డి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే మంగళవారం ఉదయం 10 గంటలకు ఆ వృద్ధుడిని లాకర్ నుంచి బయటికి తీసుకొచ్చారు.
బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యంపై కృష్ణారెడ్డి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీపీ, షుగర్ సమస్యలతో బాధపడుతున్న అతనికి ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహించేవారంటూ మండిపడ్డారు. లాకర్ నుంచి బయటికి తీసుకొచ్చిన వెంటనే కృష్ణారెడ్డిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.












Click it and Unblock the Notifications