Hyderabad: ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదు..
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఆయన అనుచరులపై కూడా కేసు నమోదు చేశారు.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పార్క్ వద్ద గోడను కూల్చివేశారనే ఆరోపణలపై దానంతో పాటు ఆయన అనుచరులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నందిగిరి హిల్స్ వద్ద ఉన్న పార్కు గోడను ఎమ్మెల్యే, అతని అనుచరులు ధ్వంసం చేశారని ఆరోపిస్తూ జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ & డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (EV&DM) ఇన్‌ఛార్జ్ వి పాపయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
జూబ్లీహిల్స్ రోడ్ నం 69 నందగిరిహిల్స్ లో జీహెచ్ఎంసీకి చెందిన ప్రభుత్వ స్థలం ప్రహరీని ఈ నెల 10న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేసినట్టు పాపయ్య ఫిర్యాదు లో పేర్కొన్నారు. ప్రహరీ కూల్చివేతతో రూ.10 లక్షల మేరకు నష్టం వాటిల్లిందని వివరించారు.దీంతో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. నాగేందర్, ఆయన అనుచరులపై భారతీయ శిక్షాస్మృతి (IPC), పబ్లిక్ ప్రాపర్టీకి నష్టం కలిగించే నిరోధక చట్టం (PDPP), వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసులో ఎమ్మెల్యే దానం నాగేందర్ ను పోలీసులు A3 గా చేర్చారు. గతంలోనూ దానం నాగేందర్ పై ఫిర్యాదులు వచ్చాయి. నాగేందర్ కాంగ్రెస్ లో జాయిన్ కాకముందు తమ భూములు కబ్జా చేశారని బేగంపేట బస్తీ వాసులు ప్రజా వాణిలో ఫిర్యాదు చేశారు. బేగంపేట ప్రకాశ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లో ఉంటున్న ఇళ్లను కబ్జా చేసి స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు.
ఈ సమస్యపై ఇక్కడికి వెళ్లినా తమ సమస్య పరిష్కారం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల దగ్గర రౌడీషీటర్లను పెట్టి భయపెడుతున్నారని బాధితులు ఆరోపించారు. ఆ తర్వాత దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బస్తీవాసుల సమస్య మొదటికొచ్చినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications