Venkatesh: హీరో వెంకటేశ్, రానా, నిర్మాత సురేష్ బాబుపై పోలీస్ స్టేషన్‍లో ఫిర్యాదు..
సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు, హీరో వెంకటేశ్, రానా, అభిరామ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందింది. ఫిల్మ్‌నగర్ డెక్కన్ కిచెన్ కేసుకు సంబంధించి ఇది కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. సినీ ప్రొడ్యూసర్ దగ్గుపాటి సురేశ్ బాబు, హీరో వెంకటేశ్, రానా, అభిరామ్‌పై ఫామ్‌హౌస్ కేసు నిందితుడు నందకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డెక్కన్ కిచెన్ హోటల్‌ను కూల్చివేయడంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చివేశారని ఫిర్యాదులో ప్రస్తావించారు. సురేశ్ బాబు, వెంకటేశ్, రానా, అభిరామ్.. జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులతో కుమ్మక్కై తన హోటల్‌ని కూల్చివేయించారని నందకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయినా తర్వాత తన హోటల్‌ను అన్యాయంగా కూల్చివేశారని వాపోయారు.

60 మంది ప్రైవేటు బౌన్సర్లను పెట్టుకుని కూల్చివేతలకు పాల్పడ్డారని చెప్పారు. డెక్కన్ కిచెన్ కూల్చేయడంతో రూ .20 కోట్లు నష్టపోయానని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే సురేశ్ బాబు, వెంకటేశ్, రానా, అభిరామ్ పై పోలీసులు కేసు నమోదు చేశారా లేదా అన్నది తెలియరాలేదు. ఈ కూల్చివేతలకు సంబంధించి గతంలో
జీహెచ్‌ఎంసీ అధికారులపై హైకోర్టు సీరియస్ అయిన సంగతి తెలిసిందే.
అప్పట్లో జరిగిన విచారణకు జీహెచ్‌ఎంసీ కమిషనర్, ప్రొడ్యూసర్ సురేష్ బాబు హైకోర్టుకి హాజరు కాకపోవడంపై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్ట్ స్టే ఆర్డర్ ఉండగా అధికారులు ఎలా కూల్చివేస్తారని హైకోర్టు నిలదీసింది. ఆదివారం, సెలవు రోజుల్లో ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎందుకు పట్టించుకోలేదని ధర్మాసనం జీహెచ్‌ఎంసీపై మొట్టికాయలు వేసింది.












Click it and Unblock the Notifications