సిటీలో దారుణం: వెంటాడి భార్య గొంతుకోసి హతమార్చాడు
హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శేరిలింగంపల్లి పరిధిలోని నల్లగండ్లలో భార్యను అతి కిరాతకంగా హతమార్చాడు ఓ భర్త. కుటుంబ కలహాల నేపథ్యంలోనే నిందితుడు ఈ ఘోరానికి తెగబడినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లి పరిధిలోని నల్లగండ్ల ప్రాంతానికి చెందిన అంబిక(26), నరేందర్ భార్యాభర్తలు. విభేదాలతో గత కొంతకాలంగా వీరు దూరంగా ఉంటున్నారు. అంభిక నల్లగండ్లలో, నరేందర్ తాండూరులో నివాసముంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నల్లగండ్లకు వచ్చిన నరేందర్.. భార్యతో గొడవకు దిగాడు.

బోటిక్‌లో పనిచేయడం మానేయాలంటూ ఒత్తిడి చేశాడు. భార్య అంభిక మాత్రం ఉద్యోగం మానేసేది లేదని స్పష్టం చేస్తూ వస్తోంది. బోటిక్ కార్యాలయం వద్ద భార్యతో ఘర్షణకు దిగాడు నరేందర్. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన భర్త నరేందర్.. రాయితో భార్య తలపై బాదాడు. గాయంతోనే ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడ్నుంచి పరుగులు తీసింది.

అయితే, అంబిక వెంటపడిన నరేందర్.. నడిరోడ్డుపై ఆమె గొంతుకోశాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భార్య అంబికపై అనుమానంతోనే భర్త నరేందర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ప్రాథమికంగా నిర్ధరించారు. కాగా, ఈ దంపతులకు ఐదేళ్ల పాప ఉన్నట్లు స్థానికులు తెలిపారు.












Click it and Unblock the Notifications