తాత వయస్సులో తండ్రి కావాలనుకున్నాడు: తనతో కొడుకును కనాలంటూ యువతికి వేధింపులు
హైదరాబాద్: తాతయ్యే వయసులో తండ్రి కావాలనుకున్నాడు ఆ వృద్ధుడు. ఇందు కోసం ఓ యువతితో కృత్రిమ గర్భధారణ పద్ధతిలో కొడుకును కనాలని ఒప్పందం చేసుకున్నాడు. ఇంత వరకు బాగానే ఉన్నా.. చివరకు తనతోనే కనాలంటూ ఆమెపై ఒత్తిడి పెంచాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

కొడుకు కావాలనే కోరికతో..
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్ నగర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఏసీపీ తిరుపతి వెల్లడించారు. పంజాగుట్టలో నివాసముంటున్న స్వరూపరాజ్(64) అనే వ్యాపారికి ముగ్గురు ఆడపిల్లలున్నారు. దీంతో తనకు కొడుకు ఉంటే బాగుంటుందని చాలా ఏళ్లుగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కొడుకు కావాలనే కోరికతో తన స్నేహితుడు నూర్‌ని సంప్రదించాడు.

యువతితో 5 లక్షలకు ఒప్పందం
నూర్ సాయంతో కృత్రిమ గర్భధారణ(సరోగసి) ద్వారా కొడుకును కనేందుకు చిలకలగూడకు చెందిన ఓ 23 ఏళ్ల యువతితో రూ. 5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతేగాకుండా, ఆమెకు ప్రసవం జరిగేంతవరకూ నెలకు రూ. 10 వేలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నాడు. ఆమెకు రూ. 50వేలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు.

కామవాంఛతో తనతోనే కొడుకును కనాలంటూ..
ఈ నేపథ్యంలో తనకు మగబిడ్డే పుట్టాలని ఒకరోజు ఆమెను బిర్లా మందిర్‌కు కూడా తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆ యువతిని వేధించడం మొదలుపెట్టాడు. ఒప్పందం ప్రకారం కాకుండా సహజ సిద్ధంగానే తనతో పిల్లలను కనాలంటూ వేధిస్తూ తన కామ వాంఛను బయటపెట్టాడు. ఇక అతని వేధింపులు తాళలేక ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది.

చివరకు కటకటాల వెనక్కి...
కాగా, బాధిత యువతికి అప్పటికే వివాహం కావడం గమనార్హం. ఈ విషయం చెప్పి, తన భర్తతో కలిసే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు స్వరూపరాజ్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడ్ని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. తాత కావాల్సిన వయస్సులో తండ్రి కావాలంటూ తన దుర్భుద్ధిని చాటుకున్న స్వరూపరాజ్ పై స్థానికులు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications