నేడు సిట్ విచారణకు బండి సంజయ్ డుమ్మా.. సిట్ ఏం చేస్తుంది?
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపిన విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ పై బండి సంజయ్ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని నోటీసులలో పేర్కొన్నారు. మార్చి 24వ తేదీన సిట్ ఎదుట హాజరు కావాలని బండి సంజయ్ కు ఇచ్చిన నోటీసుల్లో అధికారులు వెల్లడించారు.
పేపర్ లీకేజీ కుట్ర వెనుక మంత్రి కేటీఆర్ పిఏ హస్తం ఉందని, సిరిసిల్లలోనే ఎక్కువ మందికి గ్రూప్ వన్ పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చాయని బండి సంజయ్ ఆరోపించారు. ఈ ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలంటూ బండి సంజయ్ కు నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. అయితే బండి సంజయ్ కూడా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వెనుక నా హస్తం ఉందన్న కేటీఆర్ కు నోటీసులు ఇవ్వాలని, ఆయనను కూడా ఆధారాలు ఇవ్వాలని సిట్ అధికారులు అడగాలని డిమాండ్ చేశారు. సిట్ నోటీసులు పంపితే భయపడేది లేదన్నారు. అయితే సిట్ విచారణకు నేడు హాజరు కావలసి వున్న నేపథ్యంలో ఆయన హాజరు కారని చర్చ జరుగుతుంది.

శుక్రవారం విచారణకు రావాలని పోలీసులు ఆయన నివాసం వద్ద నోటీసులు అంటించి వెళ్లారు. అయితే పార్లమెంటు సమావేశాలకు హాజరుకావాలని బిజెపి పార్లమెంటరీ పార్టీ విప్ జారీ చేసిన నేపథ్యంలో, పార్లమెంటు సమావేశాలకు వెళ్ళాలన్న కారణంతో బండి సంజయ్ సిట్ విచారణకు హాజరుకారని తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఆయన సిట్ కు లేఖ రాసే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం. మొదట సిట్ ను అసలే పట్టించుకోవద్దని బిజెపి భావించినప్పటికీ మళ్లీ బిజెపి తన స్టాండ్ మార్చుకొని వ్యూహత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించింది.
ఇక ఈ నేపధ్యంలో బండి సంజయ్ తన దగ్గర ఉన్న సమాచారాన్ని సిట్ కు పంపిస్తారా లేకా సిట్ అధికారులను మరికాస్త సమయం అడుగుతారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ నేడు బండి సంజయ్ సిట్ విచారణకు హాజరు కాబోరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఏం చేయబోతున్నారు. బండి సంజయ్ కు మళ్లీ నోటీసులు ఇస్తారా? ఒకవేళ బండి సంజయ్ మళ్ళీ గడువు అడిగితే సానుకూలంగా స్పందిస్తారా? అన్నవి ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.












Click it and Unblock the Notifications