Mutton Price:బర్డ్ ఫ్లూ దెబ్బకు పెరిగిన మటన్ ధరలు.. కిలో ఎంతంటే..?
హైదరాబాదు: దేశంలో పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఆనవాలు కనిపించడంతో ఆ వార్తల ఎఫెక్ట్ ఇతర రాష్ట్రాలపై కూడా పడుతోంది. తెలుగు రాష్ట్రాలను కూడా ఈ భయం వెంటాడుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. ఇక బర్డ్ ఫ్లూ వార్తలను మటన్ వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. బర్డ్ ఫ్లూ వార్తల కారణంగా మటన్‌కు డిమాండ్ ఏర్పడటంతో అమాంతంగా రేటును పెంచేశారు మటన్ వ్యాపారులు.

మటన్ కు పెరిగిన డిమాండ్
బర్డ్ ఫ్లూ.. పక్షుల్లో కనిపించే ఈ వ్యాధి ఒకప్పుడు దేశంలోని పౌల్ట్రీ రంగాన్ని కుదిపేసింది. ఆ సమయంలో కిలో చికెన్ ఏకంగా రూ.20కి కూడా అమ్ముడుపోయింది. కొనేవాళ్లు కొని ఎంచక్కా చికెన్ కూరను ఎంజాయ్ చేశారు. మళ్లీ కొన్నేళ్ల తర్వాత బర్డ్ ఫ్లూ లక్షణాలు కొన్ని రాష్ట్రాల్లో కనిపించాయి. దీంతో అక్కడ చికెన్‌కు గిరాకీ పడిపోయింది. ఇక చికెన్ ధరలు నేలచూపులు చూస్తుండటంతో మటన్‌కు క్రమంగా డిమాండ్ పెరిగింది.

కిలో మటన్ రూ.740 పైమాటే
బర్డ్ ఫ్లూ వార్తలు మటన్ వ్యాపారస్తులకు వరంగా మారాయి. చికెన్ ధరలు పడిపోవడంతో పాటు గుడ్లు ధరలు కూడా దిగిరావడంతో మటన్ ధరలకు రెక్కలొచ్చాయి. హైదరాబాదులో ఆదివారం రోజున చాలామంది మటన్ వ్యాపారులు కిలో మటన్ రూ.740కి అమ్మారు. ఇక ఖైమా అయితే కిలో రూ.840కి విక్రయించారు.గత వారం కిలో మటన్ రూ.700గా ఉన్నింది. బర్డ్ ఫ్లూ వార్తల నేపథ్యంలో హైదరాబాదు నగరంలోని చాలా ప్రాంతాల్లో మటన్ ధరలను పెంచేశారు వ్యాపారస్తులు. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే బోన్‌లెస్ మటన్ కిలో రూ.960కి అమ్మడం జరిగింది.

మటన్ వ్యాపారస్తులు ఏం చెబుతున్నారు
ఇతర రాష్ట్రాల్లో మాత్రమే బర్డ్ ఫ్లూ ఉందని తెలంగాణకు ఆ ముప్పు లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ... ప్రజలు మాత్రం ఇప్పట్లో చికెన్ వైపు మొగ్గు చూపడం లేదు. దీంతో మటన్‌కు గిరాకీ పెరిగింది. చాలామంది మటన్ వైపే మొగ్గు చూపడంతో డిమాండ్ పెరిగి ధర కూడా పెరిగిందని ఓ మటన్ వ్యాపారి చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే చెంగిచెర్ల, జియాగుడా, అంబర్‌పేట్‌లలోని హోల్‌సేల్ మార్కెట్లలో మటన్ ధరలు పెరిగాయని, రవాణా ఖర్చులు, తమ లాభాల మార్జిన్ బేరీజు వేసుకుని మరో ఆప్షన్ లేకుండా మటన్ ధరలను పెంచాల్సి వచ్చిందని మరో మటన్ వ్యాపారస్తుడు చెప్పాడు.

కరోనా కారణంగా గతేడాది మటన్‌కు డిమాండ్
గత ఏడాది మేలో ఇలాంటి పరిస్థితే జీహెచ్‌ఎంసీ పరిధిలో తలెత్తినప్పుడు రంగంలోకి దిగిన పశుసంవర్థకశాఖ మరియు వెటిరినరీ శాఖ మటన్ ధరను కిలోకు రూ.700గా నిర్ణయించింది. కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో చికెన్ మటన్‌లు తీసుకుంటే తగ్గుముఖం పడుతుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో మటన్ వ్యాపారస్తులు క్రమంగా ధరలను పెంచేశారు. ఆ సమయంలోనే రంగంలోకి దిగిన ప్రభుత్వం మటన్ దుకాణాల ముందు ధరల బోర్డును ఉంచాలని ఆదేశాలు జారీచేసింది. అంతేకాదు మటన్ వ్యాపారస్తులు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్ముతున్నారా లేదా అనేది పర్యవేక్షించేందుకు వెటెరినరీ అధికారులను రంగంలోకి దింపింది. ప్రస్తుతం పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.