హరీశ్ రావు! అప్పులూ చెప్పండి, ఉద్యోగులకు జీతాల్లేవ్, పీఆర్సీ ఎక్కడ?: రఘునందన్ రావు ఏకిపారేశారు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంతోపాటు మంత్రి హరీశ్ రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. బంగ్లాదేశ్ కంటే భారత్ వెనుకబడి ఉందని, దేశంలో 50 శాతం కూడా వృద్ధి లేదని మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు ఆయన ఘాటైన కౌంటర్ ఇచ్చారు.

మంత్రులను బంగ్లాకు పంపిస్తాం.. ధనిక రాష్ట్రమైతే ఉద్యోగులకు జీతాలేవీ?
తెలంగాణ ధనిక రాష్ట్రమైతే ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదో మంత్రి హరీశ్ రావు చెప్పాలని రఘునందన్ రావు ప్రశ్నించారు. ధనిక రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఎందుకు అమలు చేయడం లేదో ఆర్థిక మంత్రి హరీశ్ చెప్పాలన్నారు. అంతేగాక, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడి ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ మంత్రులను స్టడీ టూర్ కోసం బంగ్లాదేశ్ పంపిస్తామన్నారు రఘునందన్ రావు.

కేటీఆర్, కవిత పంచాయతీ ఏంటో?.. హరీశ్‌కు రఘునందన్ రావు సవాల్
కేంద్రం చేస్తున్న సాయంపై అమరవీరుల స్థూపం వద్ద హరీశ్ రావుతో చర్చకు సిద్ధమంటూ రఘునందన్ రావు సవాల్ విసిరారు. బీజేపీలో పంచాయతీల గురించి ఎందుకు?.. ఒకే కుటుంబంలో కేటీఆర్, కవిత పంచాయతీ ఏంటో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రగతి భవన్లోకి ఎంట్రీ లేని హరీశ్ రావుతో నీతులు చెప్పించుకునే స్థితిలో బీజేపీ నేతలు లేరని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. గతంలో భారతదేశం గురించి మాట్లాడిన కవితకు ప్రజలిచ్చిన తీర్పే హరీశ్ రావుకూ ఇస్తారని రఘునందన్ రావు అన్నారు. ప్రజలపై ప్రేముంటే గ్యాస్ సిలిండర్‌పై తెలంగాణ ప్రభుత్వం వసూలు చేస్తున్న రూ. 291 రూపాయల పన్నును ఎత్తివేయాలని అన్నారు. పెట్రోల్‌పై తెలంగాణ ప్రభుత్వం రూ. 27 పన్నును ప్రజల కోసం ఎత్తివేస్తుందా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు.

డీఎస్సీ కూడా నిర్వహించలేని చేతకాని ప్రభుత్వం..
మంత్రి హరీశ్ రావుకు చిత్తశుద్ధి ఉంటే సర్పంచులు, పంచాయతీ సెక్రటరీల ప్రశ్నలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం సాయం చేయకుంటే ఉచిత కరెంటు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేదా? అని ప్రశ్నించారు. కరెంట్ ఇచ్చి ఆడిట్ అడటం తప్పు ఎలా అవుతుందో హరీశ్ రావు చెప్పాలని నిలదీశారు. గజ్వేల్, సిద్దిపేట, నర్సాపూర్‌కు రైల్వే లైన్ ఎవరిచ్చారో హరీశ్ రావు గుర్తు చేసుకోవాలని రఘునందన్ రావు అన్నారు. డీఎస్పీ నిర్వహించలేని చేతకాని ప్రభుత్వమంటూ మండిపడ్డారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసిందెవరో హరీశ్ రావు చెప్పాలని నిలదీశారు. అభివృద్ధిని పరిచయం చేసిందే తామని హరీశ్ రావు బాకా ఊదుకోవడం హాస్యాస్పాదమని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు.
Recommended Video

ఉద్యోగులకు పీఆర్సీ ఏది?.. హరీశ్! తెలంగాణ అప్పులూ చెప్పండి..
హరీష్ రావు చెప్పినట్టు రాష్ట్రం అభివృద్ది జరిగితే ప్రజా ప్రతినిధులు ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారో కూడా చెప్పాలన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ అన్నారు..ఏమైందని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమైనవని.. ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించారు. హరీష్ రావు అసత్యాలను ప్రచారం చేస్తారని..గ్లోబల్ ప్రచారం చేస్తారన్నారు. కేంద్రం రైతులకు మీటర్లు పెట్టబోతున్నదని దుబ్బాకలో అసత్యాలు ప్రచారం చేసి... రైతులకు అబద్ధాలు చెప్పిండన్నారు. తెలంగాణలో ఆర్థిక క్రమక్షణ లోపించిందని కాగ్ చెప్పిందన్నారు. అసెంబ్లీ ఆమోదం లేకుండానే డబ్బు ఖర్చు చేస్తున్నారనీ కాగ్ తిట్టిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే. తలసరి ఆదాయం చెప్పిన హరీష్ రావు రాష్ట్రానికి అప్పు ఎంత ఉందో ఎందుకు చెప్పడంలేదని ప్రశ్నించారు రఘునందన్ రావు.












Click it and Unblock the Notifications