కుంభకర్ణుడిలా నిద్రపోతున్న కేసీఆర్... ప్రజలు సీఎంకు బుద్ది చెప్పాల్సిందే.. : జేపీ నడ్డా
కోవిడ్ 19 మహమ్మారి కారణంగా తలెత్తిన సంక్షోభాన్ని కేంద్రం ఒక అవకాశంగా మలుచుకుని పనిచేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు కేంద్రానికి సహకరించాలన్నారు. ఓవైపు కేంద్రం కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతుంటే... తెలంగాణ ప్రభుత్వం మాత్రం కరోనా కట్టడిలో విఫలమైందన్నారు జేపీ నడ్డా.
సోమవారం(అగస్టు 10) తెలంగాణ జిల్లాల్లోని 8 జిల్లాల బీజేపీ కార్యాలయాలకు భూమి పూజ సందర్భంగా జేపీ నడ్డా ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు,ఆరోపణలు గుప్పించారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడట్లేదని నడ్డా విమర్శించారు. కరోనా కట్టడిపై దృష్టి పెట్టకుండా కేసీఆర్ కుంభకర్ణుడి నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. కరోనా టెస్టులు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిపోయిందన్నారు.లోక్‌సభ ఎన్నికల్లో షాకిచ్చినట్లు గానే... అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజలు కేసీఆర్‌కు బుద్ది చెప్పాలని అన్నారు.

తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకపోవటం వల్ల 98 లక్షల మంది భీమా సౌకర్యం కోల్పోయారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించిన నడ్డా... కేవలం దోచుకునేందుకే రూ.45వేల కోట్ల ప్రాజెక్టును రూ.85వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. గత ఆరేళ్లుగా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలిస్తానన్న కేసీఆర్... నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలిచ్చారని నిలదీశారు. రాష్ట్రంలో 7లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మిస్తామని చెప్పి... ఇప్పటివరకూ కనీసం 50వేల ఇళ్లు కూడా నిర్మించలేదని మండిపడ్డారు.
ఇక బీజేపీ కార్యాలయాల గురించి మాట్లాడుతూ.. కార్యకర్తల కోసం ప్రతీ జిల్లాలో పార్టీ కార్యాలయం ఉండాలనేది ప్రధాని మోదీ ఆలోచన అన్నారు నడ్డా. అందుకు అనుగుణంగానే పార్టీ కార్యాలయాల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నడ్డాతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు తదితరులు పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications