దగాకోరు.. అన్నీ అబద్దాలే.. కేంద్రంపై హరీశ్ రావు గుస్సా
కేంద్రం- తెలంగాణ రాష్ట్రం మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ధాన్యం కొనుగోలు, పెట్రో ధరలు.. ఇతర అంశాలపై పోరుబాట పట్టాయి. తాజాగా మంత్రి హరీశ్ రావు స్పందించారు. మెడికల్ కాలేజీ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా గోబెల్స్ ప్రచారానికి దిగిందన్నారు.
మొన్న గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలు తెలంగాణ నుంచి రాలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఇవాళ మెడికల్ కాలేజీల ఏర్పాటుపై లోక్ సభ వేదికగా దుష్ప్రచారం చేస్తోందని సీరియస్ అయ్యారు. తెలంగాణ నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయ మంత్రి భారతీ పవార్ పార్లమెంటులో చెప్పడం బాధాకరం అని హరీష్ రావు అన్నారు.

మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించిందని ఆయన తెలిపారు. అయినా, కేంద్ర మంత్రులు పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెబుతూ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారని మండిపడ్డారు. కేంద్రం సహకరించకపోయినా సీఎం కేసీఆర్ నేతృత్వంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి హరీష్ రావు తెలిపారు.
ఇటు నిన్న తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కామెంట్స్ చేశారు. ఆ వెంటనే మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. గోయల్‌పై కస్సు బుస్సుమని అన్నారు. యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో పండే మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం అంటుంది. కేంద్రాన్ని ఒప్పించేందుకు సీఎం కేసీఆర్ మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపారు. ఆ బృందానికి ఇప్పటిదాకా అపాయింట్‌మెంట్ ఇవ్వని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గురువారం కేసీఆర్ సర్కారుపై సంచలన ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆయన ఆరోపించారు. పీయూష్ గోయల్ వ్యాఖ్యలు విన్న వెంటనే తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications