చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను మరిచిపోవడమే!!
హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లపై రోజురోజుకు ఒత్తిడి ఎక్కువవుతుండటంతో ప్రత్యామ్నాయ రైల్వేస్టేషన్ గా చర్లపల్లిని దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి చేస్తోంది. సెప్టెంబరు మొదటివారంలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 95 శాతం పనులు పూర్తయ్యాయి. లింగంపల్లి నుంచి నడిచే కొన్ని రైళ్లను సికింద్రాబాద్ వచ్చే అవసరం లేకుండా సనత్ నగర్, మౌలాలి మీదుగా నేరుగా చర్లపల్లికి నడుపుతారు. మరికొన్ని రైళ్లు చర్లపల్లి నుంచే ప్రారంభమవుతాయి.
ప్రయాణికులను వెంటాడుతున్న సందేహాలు
చర్లపల్లికి చేరుకోవడానికి ఎంఎంటీఎస్ సర్వీసులు నడుపుతామని చెప్పిన అధికారులు ఎటువంటి సర్వీసులను ప్రారంభించలేదు. వాస్తవానికి ఎంఎంటీఎస్ రెండోదశ పనులు పూర్తయ్యాయి. దీనికితోడు చర్లపల్లికి చేరుకునేందుకు రెండు మార్గాల్లో రోడ్లు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆయా విభాగాల మధ్య దీనిపై సమన్వయం లేకపోవడంతో పనులన్నీ పడకేశాయి. ఆర్టీసీ సేవలు కూడా కష్టంగానే మారాయి. అతి పెద్ద రైల్వే టెర్మినల్ గా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్న చర్లపల్లికి చేరుకోవడం ఎలా? అనే సందేహం ప్రయాణికులను వెంటాడుతోంది.

ప్రతిరోజు 50 రైళ్లు నడిచేలా
దాదాపు రూ.430 కోట్ల వ్యయంతో చర్లపల్లి టెర్మినల్ ను అభివృద్ధి చేశారు. తొమ్మిది ప్లాట్ ఫారాలుంటాయి. ప్రతిరోజు 50 రైళ్లు రాకపోకలు సాగించేలా దీన్ని తీర్చిదిద్దారు. ప్రారంభ సమయంలో 25 రైళ్లను అందుబాటులోకి తెచ్చి క్రమేణా 50 రైళ్లకు పెంచుతారు. కృష్ణా, శబరి, శాతవాహనతోపాటు దూరప్రాంతాలకు రాకపోకలకు సాగించే రైళ్లు కూడా చర్లపల్లి నుంచి నడుస్తాయని అధికారులు ప్రకటించారు. అయితే స్టేషన్ కు చేరుకునేందుకు ఎటువంటి రవాణా సదుపాయాలను ఏర్పాటు చేయకపోవడంపై ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications