ys sharmilaతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు భేటీపై చర్చ -4పదవులున్న కుటుంబం -విజయమ్మ చక్రం!
తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు వైఎస్ షర్మిల. ఆమె ఎంట్రీతో ఏ పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయోనని చర్చ జరుగుతోన్న క్రమంలో.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే తనయుడు షర్మిలతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల వైఎస్ అభిమానులతో షర్మిల జరిపిన ఆత్మీయ సమ్మేళనానికి ఆ యువనేత హాజరైన సమయంలోనే లోటస్‌పాండ్‌లో మంత్రి పేరు కూడా ప్రస్తావన కు రావడం గమనార్హం.
Viral Video: నగ్నంగా ఏనుగుపై పోజులు -టెన్నిస్ లెజెండ్ కూతురి నిర్వాకం -విషాదకర ఘటనగా..

షర్మిలతో కాలె రవికాంత్ భేటీ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అన్ని పార్టీలూ కీలకంగా భావించే చేవెళ్ల స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాలె యాదయ్య. ఎమ్మెల్యే రెండో కొడుకు కాలె రవికాంత్ వరుసగా రెండు సార్లు షర్మిలతో భేటీ అయ్యారు. లోటస్ పాండ్ వేదికగా శుక్రవారం షర్మిలను కలిసిన రవికాంత్.. శనివారం నాటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆత్మీయ సమావేశానికి కూడా హాజరైనట్లు తెలిసింది. షర్మిలకు రవికాంత్ అభివాదం చేస్తున్న ఫొటో ప్రస్తుతం వైరల్ అయింది. షర్మిలతో భేటీపై కాలె తనయకుడు వివరణ ఇచ్చినప్పటికీ, ప్రస్తుత తరుణంలో అసలాయన లోటస్ పాండ్ ఎందుకు వెళ్లాల్సింది? తండ్రి అనుమతితోనే ఈ తతంగం జరిగిందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
అసదుద్దీన్ అనూహ్యం: యూపీలో సమాజ్ వాదీ ఫ్యామిలీతో పొత్తు! -బెంగాల్లో ఐఎస్ఎఫ్తో -25న ఓవైసీ ర్యాలీ

వైఎస్ వీరాభిమాని కాలె యాదయ్య..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తొలుత స్థానిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పదవి చేపట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంపీపీ, జెడ్పీటీసీగానూ గెలుపొందిన కాలె యాదయ్య తాను వైఎస్ వీరాభిమానిని అని గతంలో చాలా సార్లు చెప్పుకున్నారు. వైఎస్సార్ పట్టుపట్టిమరీ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి యాదయ్యకు టికెట్ ఇప్పించారు. తొలిసారి ఓడిపోయినా.. తర్వాతి కాలంలో ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో టీఆర్ఎస్ లో చేరిన యాదయ్య జిల్లాలో కీలక నేతగా కొనసాగుతున్నారు. గతంలో వైఎస్‌కు దగ్గరి నేతలుగా పేరుపొందిన వాళ్లందరికీ షర్మిల కొత్త పార్టీ నుంచి ఆహ్వానాలు వెళుతోన్న క్రమంలోనే కాలె కుటుంబానికీ పిలుపు వచ్చిందని, ఎమ్మెల్యే నేరుగా వెళ్లి షర్మిలతో భేటీ కాకుండా కుమారుడ్ని పంపించి ఉంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే..

ఆ కుటుంబలో 4 కీలక పదవులు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాలె కుటుంబం నాలుగు కీలక పదవుల్లో కొనసాగుతోంది. కాలె యాదయ్య చేవెళ్ల ఎమ్మెల్యే కాగా, యాదయ్య సతీమణి జయమ్మ నవాబ్‌పేట మండల జడ్పీటీసీగా, పెద్ద కుమారుడు శ్రీకాంత్ మొయినాబాద్ జడ్పీటీసీగా ఉన్నారు. ఇక రెండో కొడుకు రవికాంత్ భార్య దుర్గాభవాని.. చించల్‌పేట్ ఎంపీపీగా కొనసాగుతున్నారు. సీఎం కేసీఆర్ అనుమతితో తన కుటుంబీకులను బరిలోకి దింపిన యాదయ్య.. అందరినీ గెలిపించుకుని సత్తా చాటారు. అలాంటిదిప్పుడు రవికాంత్.. షర్మిలపెట్టే కొత్త పార్టీలో చేరే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే తాము టీఆర్ఎస్ లోనే ఉంటామని రవికాంత్ చెబుతున్నారు. మరి అలాంటప్పుడు లోటస్ పాండ్ కు వెళ్లాల్సిన అవసరం ఏంటని కాలె వ్యతిరేక వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.

చేవెళ్ల చెల్లెమ్మపై అనూహ్య వ్యాఖ్యలు
హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వైఎస్ అభిమానులతో షర్మిల జరిపిన సమావేశంలో జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రస్తావన వచ్చినట్లుగా తెలుస్తోంది. వైఎస్సార్ బతికున్నప్పుడు చేవెళ్లను సెంటిమెంటుగా భావించడం, అక్కడి నేత సబితా ఇంద్రారెడ్డికి ఏకంగా ‘చేవెళ్ల చెల్లెమ్మ'అని పేరు పడటం తెలిసిందే. చేవెళ్ల చెల్లెమ్మ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళుతున్నారని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక నేత షర్మిలతో వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చాయి. తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించబోతోన్న షర్మిల.. ఇక్కడి సమస్యలు, అధికార టీఆర్ఎస్, ఇటీవల కాలంలో బాగా బలపడిన బీజేపీలను ఎలా ఎదుర్కోవాలి? తరహా ప్రశ్నలకు అభిమానుల నుంచి సమాధానాలు రాబడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే..

షర్మిలకు తల్లి విజయమ్మ సహకారం?
తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు వైఎస్ షర్మిల సన్నాహాలను వేగవంతం చేశారు. వైఎస్ హయాంలో నిర్మించిన నీటి ప్రాజెక్ట్‌లు, వాటి పరిస్థితిపై షర్మిల అధ్యయనం చేస్తున్నారు. తెలంగాణలో పెట్టబోయే తన కొత్త పార్టీ విధివిధానాలు ఏ రకంగా ఉండాలనే దానిపై కసరత్తు చేస్తున్నట్టు లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ నిర్మాణం కోసం సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకోవాలని షర్మిల నిర్ణయించారు. తండ్రి వైయస్‌ఆర్‌కు దగ్గరగా ఉన్న నేతలను, మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌లతో మంతనాలు చేస్తున్నారు. ఇందుకోసం.. తల్లి విజయమ్మ సహకరం తీసుకుంటున్నట్లు సమాచారం. వైఎస్‌ఆర్ హయాంలో సీఎంఓలో పని చేసిన పలువురు సీనియర్ అధికారులకు ఫోన్ చేసి తన కూతురుకు సహకరించాలని విజయమ్మ కోరినట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీకి విజయమ్మ గౌరవ అధ్యక్షురాలన్న సంగతి తెలిసిందే.