గద్దరన్నకి లాల్ సలాం!: చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ భావోద్వేగం
హైదరాబాద్: ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గద్దర్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు. గద్దర్ మృతిని ఊహించలేకపోతున్నామని సినీ ప్రముఖులు చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, తదితరులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
గద్దర్ మృతికి ప్రముఖ సినీనటుడు చిరంజీవి ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. 'వారి గళం అజరామరం. ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు, 'ప్రజా యుద్ధ నౌక' గద్దరన్న కి లాల్ సలాం !' అంటూ పేర్కొన్నారు.

ఇంకా, 'సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటల పాటలతో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని కలుగజేసింది. ప్రజా సాహిత్యం లో, ప్రజా ఉద్యమాల లో ఆయన లేని లోటు ఎప్పటికీ పూడనిది. పాటల్లోనూ, పోరాటంలోనూ ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులకు ,లక్షలాది ఆయన అభిమానులకు , శ్రేయోభిలాషులకు నా ప్రగాడ సంతాపం ' అని చిరంజీవి తెలిపారు.
గద్దర్ మృతికి మరో ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు. 'తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలు నడిపించిన విప్లవకారుడు, ప్రజా ఉద్యమ నాయకుడు గద్దర్ మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. గద్దర్ ఓ విప్లవ శక్తి. ప్రజా ఉద్యమ పాటలంటే తెలుగు రాష్ట్రాల్లోనూ దేశ వ్యాప్తంగా మన గద్దర్ గుర్తుకు వస్తారు. ప్రజా ఉద్యమాల్లో గద్దర్ లేని లోటును ఎవ్వరు తీర్చలేరు. గద్దర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని నందమూరి బాలకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వారి గళం అజరామరం. ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు, 'ప్రజా యుద్ధ నౌక' గద్దరన్న కి లాల్ సలాం ! 🙏🙏
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 6, 2023
సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటల పాటల తో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర… pic.twitter.com/a7GtDUFYeD
విప్లవ వీరుడు, పోరాట యోధుడు గద్దర్ మృతి పట్ల జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉద్యమకారుడు గద్దర్ మరణం తీవ్ర విషాదాన్ని నింపిందని పవన్ అన్నారు.
ప్రజా గాయకుడు, ఉద్యమకారుడు, "ప్రజా యుద్ద నౌక" శ్రీ గద్దర్ గారి మరణం తీవ్ర విషాదకరం
— JanaSena Shatagni (@JSPShatagniTeam) August 6, 2023
తన పాటలతో, మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని సైతం ఉత్తేజపరిచిన విప్లవ వీరుడి మరణం సందర్భంగా @JanaSenaParty తరపున నివాళులు అర్పిస్తున్నాము.#RIPGaddar pic.twitter.com/Hpelxrx45v
కాగా, ఇటీవల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో గద్దర్‌ను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ క్రమంలో వారిద్దరి ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులు పంచుకుంటున్నారు. పవన్ అంటే తనకు చాలా ఇష్టమని.. తమ్ముడి కంటే ఎక్కువని గద్దర్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. తన ఇంటికి వెళ్లినప్పుడు పవన్ జేబులో ఎన్ని డబ్బులున్నా.. తీసుకుంటానని గద్దర్ తెలిపారు. కష్టాలు వచ్చినప్పుడు పవన్ ఆదుకున్నాడని.. చాలా మంచివాడని గద్దర్ చెప్పారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గద్దర్ మృతికి సినీ దర్శకుడు ఎన్ శంకర్ సంతాపం తెలిపారు. 'పల్లె పాట మీద ప్రేమ పెంచుకుని, జనం పాటను గుండెకు హత్తుకుని, పోరుపాటను ఎగిరే ఎర్రజెండాకు అద్దిన, ప్రజల గుండె గొంతుక ప్రజా యుద్ధనౌక అందించిన స్ఫూర్తి చరిత్ర మరవదు. గద్దరన్న ఏ లోకంలో ఉన్నా.. అన్న పాట అన్ని కాలాల్లో వినిపిస్తూనే ఉంటుంది. జోహర్ గద్దరన్న' అని ఎన్ శంకర్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications