ఇదీ బీజేపీ సాధించిన విజయం.. కేసీఆర్ వడ్లు కొంటామనే ప్రకటనపై బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షం బీజేపీ స్పందిస్తోంది. ఇప్పటికే రాములమ్మ విజయశాంతి రియాక్ట్ కాగా.. తర్వాత ఆ పార్టీ చీఫ్ బండి సంజయ్ కూడా స్పందించారు. ఇదీ తమ ఘనతేనని చెప్పుకొచ్చారు. వరి కొనం అని చెప్పిన ప్రభుత్వంతో కొనుగోలు చేసేలా చేశామని ఆయన అన్నారు.
వరి వేస్తే ఉరే అన్న ముఖ్యమంత్రితో వడ్లు కొనుగోలు చేయిస్తున్నామని బండి సంజయ్ తెలిపారు. ఇది బీజేపీ ఘనత అని చెప్పుకొచ్చారు. సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఇదే వార్త అని, ఇది బీజేపీ సాధించిన విజయం అంటున్నారని పేర్కొన్నారు. ధాన్యం కొంటావా? లేక గద్దె దిగిపోతావా? అంటూ కేసీఆర్‌కు తాము చేసిన హెచ్చరిక ఫలితం ఇచ్చిందని వెల్లడించారు.

నిన్న తాము చేపట్టిన దీక్ష కేసీఆర్‌ను భయపెట్టిందని బండి సంజయ్ అన్నారు. సీఎం మోసం చేస్తున్నారనే భావన రైతుల్లో కలుగుతుందని నిఘా వర్గాల నుంచి నివేదిక వచ్చిందని తెలిపారు. దాంతో రైతులు తన కుర్చీ కింద పొగపెడతారని భయపడిన కేసీఆర్ ధాన్యం కొనుగోలు ప్రకటన చేశారని వివరించారు. లేదంటే ఆయన చేసేవారు కాదన్నారు. ఎప్పటికీ నెపం తమపై నెట్టాలని చూసేవారని చెప్పారు. కానీ చివరికీ తప్పలేదని వివరించారు. ఇదీ ముమ్మాటికీ తాము సాధించిన విజయం అని చెప్పారు.
అంతకుముందు మీడియాతో కేసీఆర్ మాట్లాడారు. యాసంగిలో ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో ఎంత దిగుబడి వచ్చినా మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. క్వింటాల్ ధాన్యానికి రూ.1960 చొప్పున కొనుగోలు చేస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని రైతులకు సూచించారు. ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు తెలిపారు. ఇదీ బీజేపీ సాధించిన విజయం అని బండి సంజయ్ అన్నారు.












Click it and Unblock the Notifications