50 వేల కొలువల ప్రకటన వెనక కుట్ర, నిరుద్యోగులు ఇప్పుడే గుర్తొచ్చారా: విజయశాంతి
50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అన్నీ విభాగాల్లో ఖాళీల ఆధారంగా కొలువుల అని చెప్పారు. అయితే ఈ ప్రకటనపై బీజేపీ నేత రాములమ్మ విజయశాంతి స్పందించారు. కేసీఆర్ చేసిన ఉద్యోగాల భర్తీ వెనుక కుట్ర ఉందన్నారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులు గుర్తుకొస్తారని విమర్శించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

50 వేల కొలువుల అట..
తెలంగాణలో 50 వేల ప్రభుత్వ కొలువులు భర్తీ చేస్తామని 7 నెలల కిందట ప్రకటించారని విజయశాంతి గుర్తుచేశారు. ఉన్నట్టుండి నిరుద్యోగులపై ప్రేమ పుట్టి వెంటనే కొలువుల భర్తీకి చర్యలు చేశారని సెటైర్లు వేశారు. ఉద్యోగాలు అని కేసీఆర్ ఎప్పుడు ప్రకటించినా దాని వెనుక ఎంతో పకడ్బందీ కుట్ర ఉంటుందన్నారు. ఏడు నెలల కింద చేసిన ఆ 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రకటనను నాన్చి నాన్చి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అస్త్రంగా వాడుకున్నారని గుర్తుచేశారు. తమ అభ్యర్థులు గెలిచాక... ఉద్యోగాల భర్తీ ప్రకటనను ఉఫ్‌మని ఊదేశారని.. ఇప్పుడు హుజురాబాద్ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని మళ్ళీ భర్తీ అంటూ బాజాలు మోగిస్తున్నారని ఫైరయ్యారు.

మూడేళ్ల నుంచి నో..
గత మూడేళ్ళుగా జాబ్ నోటిఫికేషన్లు లేవని.. అంతకు ముందు కూడా చిన్నా చితకా నోటిఫికేషన్లు తప్ప ఉద్యోగాల భర్తీకి పెద్ద నోటిఫికేషన్లు ఏవీ రాలేదన్నారు. ఎందరో నిరుద్యోగులకు వయో పరిమితి దాటిపోయి... తమ కలల్ని సాకారం చేసుకునే అవకాశానికి శాశ్వతంగా దూరమైపోయారని చెప్పారు. మిగతా నిరుద్యోగులు ఏజ్ బార్ ప్రమాదానికి దగ్గర పడ్డారు... పడుతున్నారని చెప్పారు. తెలంగాణ వచ్చినా సర్కారు కొలువులు దక్కలేదనే నిరాశతో పలువురు నిరుద్యోగులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.
Recommended Video

మనమడు, ముని మనమడు
నిజంగా ఉద్యోగాల భర్తీపై చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి పరిస్థితి రానిచ్చేవారు కాదన్నారు. నిజానికి లక్షా 90 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు ఉంటే... అందులో ఇప్పుడు తొలి దశలో 50 వేల ఉద్యోగాల భర్తీ అంటున్నారని... దీనికే ఎంత సమయం తీసుకుంటున్నారో అని సందేహం వ్యక్తం చేశారు. మిగిలిన లక్షా 40 వేల పైచిలుకు పోస్టుల భర్తీ కావాలంటే ఆయన కొడుకు, మనుమలు, మునిమనుమలు కూడా సీఎంలు అయ్యే వరకూ ఎదురు చూడాలేమో అని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications