కాంగ్రెస్ జంగ్ సైరన్-దిల్‌సుఖ్‌నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత-ఎక్కడికక్కడ అరెస్టులు-రేవంత్ నివాసం వద్ద భారీగాపోలీసులు
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ ఉద్రిక్తంగా మారింది. ర్యాలీకి అనుమతి లేదని చెబుతూ కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఎలాగైనా జంగ్ సైరన్‌ను విజయవంతం చేయాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. జంగ్ సైరన్ ర్యాలీకి రేవంత్ వెళ్లకుండా కట్టడి చేసేందుకే పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్ద పోలీసులను దించారు.
ఇప్పటికే రేవంత్ తన నివాసం నుంచి ర్యాలీ కోసం బయలుదేరారనే ప్రచారం జరుగుతోంది. ఏ క్షణంలోనైనా ఆయన దిల్‌సుఖ్ నగర్ చేరుకునే అవకాశం ఉండటంతో... అక్కడ కూడా భారీగా పోలీసులను మోహరించారు. అక్కడికి చేరుకున్న పలువురు కాంగ్రెస్ నేతలను ఇప్పటికే అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ ఇన్‌చార్జి మల్‌రెడ్డి రాంరెడ్డి,టీపీసీసీ అధికార ప్రతినిధి సుంకెపల్లి సుధీర్ రెడ్డిలు ఉన్నారు.ఉద్రిక్తతల నేపథ్యంలో దిల్‌సుఖ్ నగర్ మెట్రో స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు.

కాంగ్రెస్ నేతలు,కార్యకర్తల అరెస్టులను రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అరెస్టయినవారిని వెంటనే విడుదలచేయాలని డిమాండ్ చేశారు. అరెస్టులకు,లాఠీచార్జిలకు భయపడాల్సిన పని లేదని... సాయంత్రం 4గంటల కల్లా అంతా దిల్‌సుఖ్‌నగర్ చేరుకోవాలని పిలుపునిచ్చారు.ఇదంతా ముఖ్యమంత్రికి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అని ప్రశ్నించారు. కొంతమంది పోలీసులు అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని ఆటంకాలు,అవాంతరాలు ఎదురైనా నిరుద్యోగ జంగ్ సైరన్ జరిగి తీరుతుందన్నారు.
అంతకుముందు,ఇదే అంశంపై రేవంత్ మాట్లాడుతూ... దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు.ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలన్నారు. పోలీసులు కూడా ర్యాలీకి సహకరించాలని... ఒకవేళ అత్యుత్సాహం ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పోలీసులు ర్యాలీని అడ్డుకుంటే తానే ముందుంటానని... కార్యకర్తలు భయపడాల్సిన పని లేదని అన్నారు. ర్యాలీలో లాఠీ తగిలినా... తూటా తగిలినా ముందు తనకే తగులుతుందన్నారు.
శనివారం(అక్టోబర్ 2) మధ్యాహ్నం 3గంటలకు దిల్‌సుఖ్ నగర్‌లోని రాజీవ్ చౌక్ నుంచి ఎల్బీనగర్‌లోని శ్రీకాంత చారి విగ్రహం వరకు కాంగ్రెస్ జంగ్ సైరన్ ర్యాలీ తలపెట్టింది.అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.మొదట ర్యాలీకి అనుమతినిచ్చి ఆ తర్వాత నిరాకరించారని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు.అనుమతి లేకపోయినా ర్యాలీని సక్సెస్ చేసి తీరుతామని చెబుతున్నారు.
నిరుద్యోగులు, విద్యార్థలకోసం గళమెత్తిన పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని అడ్డుకోడానికి పోలీసులను మొహరించిన పిరికి నియంత.
— Telangana Congress (@INCTelangana) October 2, 2021
అమరుల ఆశయాలను కాలరాసిన #తెలంగాణద్రోహికేసీఆర్.
నీ భయమే నీ పతనానికి సంకేతం కేసీఆర్! నువ్వు ఎంత అణచివేస్తే అంత పైకి లేస్తం!#VidyardhiNirudhyogaSiren pic.twitter.com/XJbIcSAYQJ












Click it and Unblock the Notifications