ఎన్నిక వాయిదా వేసే కుట్ర.. ఢిల్లీలో కేసీఆర్ లాబీయింగ్: జగ్గారెడ్డి
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. హుజురాబాద్ ఎన్నిక, బీజేపీ నేతలపై కూడా ఫైరయ్యారు. ఢిల్లీలో లాబీయింగ్ చేయడానికి మకాం వేశారని ఆరోపించారు. కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు కొనసాగాయి. కాంగ్రెస్ బలాన్ని తట్టుకోలేక కేసీఆర్ ఢిల్లీకి పోయి ఎన్నికలు వాయిదా వేసుకున్నారని అన్నారు. కేసీఆర్ అధికార పీఠం నిలుపుకునేందుకు బీజేపీకి దగ్గరవుతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు.
ఢిల్లీలో ఆయన బీజేపీ నేతలతో తిరుగుతున్నారని వెల్లడించారు. బలపడుతున్న కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేందుకు బీజేపీ, టీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. బండి సంజయ్ ఓ డమ్మీ నేత అని, ఢిల్లీ బీజేపీ పెద్దలు బండిని బకరా చేశారని ఎద్దేవా చేశారు. కేసీఆర్, అమిత్ షా ఆటలో బండి బలైపోతారని కామెంట్ చేశారు. బండి సంజయ్ మొదటి బకరా అయితే, ఈటల రాజేందర్ రెండో బకరా అని ఎద్దేవా చేశారు. తెలంగాణ బీజేపీ చేతుల్లో ఏమీలేదని, అంతా ఢిల్లీ చేతుల్లోనే ఉందని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

ఇటు ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీగా ఉన్నారు. ప్రధాని మోడీకి తమ సమస్యలను సంగతి తెలిసిందే. నిన్ప కేంద్ర ఉపరితల రవాణ,జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం అయ్యారు. ఎన్ హెచ్ 165 హైదరాబాద్ (ఓఆర్ఆర్) కల్వకుర్తి వరకు ఉన్న రహదారి నాలుగు లైన్ల రహదారిగా గుర్తించాలని సిఎం కేసీఆర్ గడ్కరీని కోరారు. 2021-2022, 2022-2023 రెండు ఆర్థిక సంవత్సరాల్లో సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్) కింద పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను తక్షణమే ఆమోదించాలని కూడా సీఎం గడ్కరీ కి విజ్ఞప్తి చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం కేసీఆర్ ఈ మధ్య సమావేశం అయ్యారు. 10 అంశాలపై చర్చ జరిగింది. ఐపిఎస్ క్యాడర్ పై కేంద్రం సమీక్షించాలని మోడీని సీఎం కేసీఆర్ కోరారు. అలాగే రాష్ట్రంలో సమీకృత టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్- నాగపూర్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేయాలని విన్నవించారు. కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధులివ్వాలని పేర్కొన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మెరుగుపరచాలని కోరారు. కరీంనగర్ లో ట్రిపుల్ ఐటి ఏర్పాటు చేయాలని.. హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు చేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని.. 10 అంశాలకు సంబంధించిన లేఖలు అందజేశారు. ఈ క్రమంలో జగ్గారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.












Click it and Unblock the Notifications