బెంగళూరు కేంద్రంగా కాంగ్రెస్- షర్మిల ప్లాన్: ఏం జరుగుతోంది?
హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోనుందా?, ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలతో ఇప్పటికే సంప్రదింపులు మొదలు పెట్టిందా?, ఆమెను ఒప్పించడానికి వైఎస్సార్ కార్డ్‌ను ప్రయోగించిందా?.. అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కూడా షర్మిలకు పంపించిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. బెంగళూరు కేంద్రంగా మంతనాలు సాగిస్తోన్నట్లు చెబుతున్నారు.
కర్ణాటకలో భారతీయ జనతా పార్టీని మట్టికరిపించిన ఊపు మీద ఉంది కాంగ్రెస్. ఇక ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. తెలంగాణ సహా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంపై దృష్టి సారించింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం, మిగిలిన చోట్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకుంటోంది.

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితిని ఎదుర్కొనడానికి అవసరమైన కసరత్తు ఆరంభించింది కూడా. ఇందులో భాగంగా ఇప్పటికే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తెలంగాణలో పర్యటించారు. బహిరంగసభను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా ఆమె బాధ్యతలను సైతం వెనుకాడట్లేదు. ఈ స్వీకరించడానికి ఆసక్తిగా ఉన్నారు.
బీఆర్ఎస్‌ను ఎదుర్కొనడంలో భాగంగా- భావసారూప్యం గల పార్టీలను కలుపుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే వామపక్షాలు బీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ దృష్టి వైఎస్ షర్మిలపై పడిందని చెబుతున్నారు. వైఎస్ఆర్టీపీని విలీనం చేసుకోవడమా? లేక పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడమా? అనే విషయంపై తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉందని సమాచారం.

వైఎస్ఆర్టీపీని విలీనం చేసుకోవడానికే కాంగ్రెస్ ఆసక్తిగా ఉందనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. వైఎస్ షర్మిలతో కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కానుగోలు సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. బెంగళూరు కేంద్రంగా దీనికి సంబంధించిన మంతనాలు సాగుతున్నాయని తెలుస్తోంది. పొత్తు లేదా విలీనం విషయంలో కాంగ్రెస్ పార్టీ- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కార్డ్‌ను ప్రయోగిస్తోన్నట్లు చెబుతున్నారు.
వైఎస్ఆర్టీపీ విలీనం లేదా పొత్తు పెట్టుకోవడం అంటూ జరిగితే- అది ఏపీ రాజకీయాలను సైతం ప్రభావితం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. ఏపీలో నామమాత్రంగా కూడా మనుగడలో లేని పార్టీని పునరుజ్జీవింపజేయడానికి మళ్లీ- వైఎస్ కుటుంబంతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని, ఇందులో భాగంగానే- షర్మిలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications