అప్పుడు కేటీఆర్ హీరోయిన్ల పేర్లు బయటకు రానీయలేదు: రాజాసింగ్ సంచలనం
డ్రగ్స్ వ్యవహారం పెను దుమారం రేపుతోంది. దీనిపై అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. తాజాగా బాల్క సుమన్ చేసిన కామెంట్లపై బీజేపీ నేత రాజాసింగ్ స్పందించారు. ఇప్పుడే కాదు గతంలో జరిగిన డ్రగ్స్ కేసు గురించి ఆయన ప్రస్తావించారు. మొత్తానికి పబ్ డ్రగ్స్ కేసు రాజకీయంగా వాదోప వాదనలకు దారితీసింది.
ఇప్పుడు కాదు.. గతంలో జరిగిన డ్రగ్స్ ఇష్యూను ఇప్పుడు రాజాసింగ్ తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు బీజేపీ నేతలు ఉన్నారని సుమన్ కామెంట్ చేశారు. గతంలో సినీ నటుల విషయంలో జరిగిన కేసు ఏమైందని ఆయన అడిగారు. ఆ కేసులో హీరోయిన్లు కూడా ఉండేవారని చెప్పారు. కానీ వారి పేర్లను మంత్రి కేటీఆర్ తొలగించారని చెప్పారు. బయటకు రాకుండా చేశారని ఆరోపించారు. ఆ ఫైల్ మూటగట్టి పక్కన పడేశారని తెలిపారు. అంతేకాదు పట్టుబడిన వారిలో కొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వివరించారు. మరీ మిగతావారి సంగతి ఏంటీ అని అడిగారు. వారిని ఎందుకు వదిలేశారని ఆయన ప్రశ్నించారు.

ఇక నిన్న బంజారాహిల్స్ పబ్ డ్రగ్ కేసు కలకలం రేపింది. 142 మంది పేరుతో పోలీసులు జాబితా కూడా విడుదల చేశారు. దీనిపై విచారణ కూడా జరుపుతున్నారు. ఈ డ్రగ్స్ ఎక్కడిది..? మీకు ఎవరూ సరఫరా చేశారు..? అన్న దానిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కూపీ లాగుతున్నారు. నలుగురిని అరెస్ట్ చేసిన అనంతరం వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అరెస్టైన వారిలో పబ్ నిర్వాహకుడు అభిషేక్, ఈవెంట్ మేనేజర్ అనిల్ ఉన్నారు. ఈ కేసులో మరింత పురోగతి సాధించేందుకు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ఏసీపీ నర్సింగ్ రావు, వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనాథ్ రంగంలోకి దిగి కేసు విచారణ చేస్తున్నారు.
డ్రగ్స్ ఘటన కలకలం రేపిన వెంటనే బంజారాహిల్స్ సీఐ శివచంద్రను... సీపీ సీవీ ఆనంద్ సస్పెండ్ చేయగా, ఏసీపీకి మెమో జారీ చేశారు. కొత్త సీఐగా నాగేశ్వర్‌రావును నియమించారు. గత ఆరేళ్లలో టాస్క్‌ఫోర్స్‌లో నాగేశ్వర్‌రావు కీలక పాత్ర పోషించారు. పలు డ్రగ్స్ రాకెట్లను బట్టబయలు చేశారు. అందుకే అతనికి బాధ్యతలు అప్పగించారు.












Click it and Unblock the Notifications