ఔటర్ రింగ్‌రోడ్‌పై వెంటాడి మరీ కాల్పులు!
హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్‌పై కాల్పులు కలకలం సృష్టించాయి. దుండగులు కారులో వెంటాడి మరీ లారీ డ్రైవర్ పై కాల్పులు జరిపారు. ఐరన్ లోడ్ తో వెళుతున్న లారీని వెంబడిస్తూ స్విఫ్ట్ కారులో ఒక వ్యక్తి వచ్చారు. శంషాబాద్ తుక్కుగూడ 'ఎగ్జిట్ 14' వద్దకు లారీ వచ్చిన తర్వాత కారులో వచ్చిన వ్యక్తి అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. అయితే తుపాకీ గురి తప్పడంతో లారీ అద్దాలు పగిలిపోయాయి.
డ్రైవర్ మనోజ్ 'డయల్ 100' ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మెదక్ నుంచి ఐరన్ లోడ్ తీసుకొని కేరళలోని కొచ్చి నగరానికి బయలుదేరినట్లు మనోజ్ తన పిర్యాదులో పేర్కొన్నారు.

ఈ కాల్పుల పని అంతర్రాష్ట్ర దొంగలముఠా పనిగా అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఔటర్ రింగ్ రోడ్ పై గతంలోను మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడుకు చెందిన దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. విలువైన వస్తువులను రవాణా చేసే లారీలు, కంటైనర్లను గుర్తించడం, వీటిని లక్ష్యంగా ఎంచుకోవడం, డ్రైవర్లను బెదిరించడం, లేదంటే వారిని హత్యచేయడం లాంటివి చేస్తున్నారు.
కొద్దిరోజుల క్రితమే సబ్బులు, లారీ టైర్ల లోడుతో వెళుతున్న లారీలను అడ్డగించి కొన్ని ముఠాలు దోచుకున్నాయి. ఈ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కాల్పులు జరిపింది కూడా ఈ ముఠాల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పులు జరిగిన తర్వాత నిందితులు వరంగల్ వైపు వెళ్లివుంటారని భావిస్తున్న పోలీసులు అటువైపు కూడా దర్యాప్తు కోసం ఒక బృందాన్ని పంపించారు.












Click it and Unblock the Notifications