TGSRTC: శుభవార్త చెప్పిన ఆర్టీసీ.. వారికి టికెట్ లో 10 శాతం డిస్కౌంట్..
హైదరాబాద్ లోని మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ దారులకు శుభవార్త చెప్పింది ఆర్టీసీ. తమ దగ్గర ఉన్న బస్ పాస్ తో లహరి, రాజధాని, గరుడ ప్లస్, ఈ-గరుడ, తదితర ఏసీ సర్వీసుల్లో ప్రయాణిస్తే టికెట్ లో 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అన్ని టీజీఎస్ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఈ 10 శాతం డిస్కౌంట్ వర్తిస్తుందని పేర్కొంది. మెట్రో ఎక్స్ ప్రెస్ తో పాటు మెట్రో డీలక్స్, గ్రీన్ మెట్రో, ఎయిర్ పోర్ట్ పుష్ఫక్ బస్ పాస్ దారులు ఈ రాయితీని పొందవచ్చని తెలిపింది.
వచ్చే ఏడాది జనవరి 31 వరకు 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని వెల్లడించింది. "హైదరాబాద్ లో దాదాపు 70 వేల వరకు మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాసులున్నాయి. వారిలో ఎక్కువగా వీకెండ్ లో సొంతూళ్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే బస్ పాసుదారుల సౌకర్యార్థం ఏసీ సర్వీసుల్లో 10 శాతం రాయితీని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. సంస్థ అధికారిక వెబ్ సైట్ tgsrtcbus.in లో ముందస్తు రిజర్వేషన్ చేసుకుని రాయితీని పొందవచ్చు. జనరల్ బస్ పాస్ దారులు 10 శాతం డిస్కౌంట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం" అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

ఆర్టీసీ ఎప్పటికప్పుడు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడుపుతోంది. కార్తీక మాసం సందర్భంగా పలు హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. టికెట్లు బుక్ చేసుకునే వారు ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చని ఇప్పటికే ప్రకటించారు. తెలంగాణలోని హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
ఈ నెల 15న కార్తీక పౌర్ణమి కాగా, 13 నుంచి ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. కాణిపాకం, గొల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత కార్తీక పౌర్ణమి పర్వదినం నాడు అరుణాచలానికి చేరుకుంటాయి. అలాగే హైదరాబాద్ లోని భక్తుల సౌకర్యార్థం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటీ దీపోత్సవానికి కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.












Click it and Unblock the Notifications