హైదరాబాద్‌కు భారీ ఎత్తున అమ్మోనియం నైట్రేట్... గవర్నర్ తమిళిసై ఆందోళన...
చెన్నై నుంచి హైదరాబాద్‌కు 697 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ని తరలించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ ఈ వేలంలో దీన్ని కొనుగోలు చేయడంతో కంటైనర్ల ద్వారా హైదరాబాద్ తరలించారు. మొదట ఆదివారం కొన్ని కంటైనర్లు నగరానికి చేరగా... సోమవారం రాత్రి మరికొన్ని కంటైనర్లు చేరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు.
అమ్మోనియం నైట్రేట్ హైదరాబాద్‌కు తరలింపుపై ట్విట్టర్‌లో గవర్నర్ స్పందించారు. 'ఆదివారం రాత్రి అమ్మోనియం నైట్రేట్‌ను హైదరాబాద్ తరలించినట్లు తెలియడంతో ప్రజల భద్రత గురించి ఆందోళనకు గురయ్యాను. పరిస్థితిని అంచనా వేసి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి సంబంధిత అధికారులతో మాట్లాడాను.' అని ట్విట్టర్‌లో తమిళిసై పేర్కొన్నారు.

ఇటీవల లెబనాన్ రాజధాని బీరట్‌లో పేలుళ్ల తర్వాత అమ్మోనియం నైట్రేట్ నిల్వలపై భారత్‌లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా హైదరాబాద్‌కు తరలించిన అమ్మోనియం నైట్రేట్ కెమికల్ లోడ్ గత ఐదేళ్లుగా గోదాముల్లోనే నిల్వ ఉంది. తమిళనాడుకు చెందిన ఓ కంపెనీ దక్షిణ కొరియా నుంచి 2015లో దాదాపు 742 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను నిల్వ చేసింది. అయితే సరైన లైసెన్స్ లేని కారణంగా కస్టమ్స్ అధికారులు ఈ కెమికల్ లోడ్‌ను సీజ్ చేశారు. చెన్నై వరదల కారణంగా ఇందులో కెమికల్ వృథాగా పోయింది. మిగిలిన 697 టన్నుల కెమికల్‌ను హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ కొనుగోలు చేసింది. దీంతో ఆదివారం రాత్రి నుంచి ఈ లోడ్‌ను చెన్నై నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు.
Yesterday late night heard about the shift of #AmmoniumNitrate to #Hyderabad .. concerned about the safety of people ..reached out concerned officials to asses and follow up the situation...#SafetyFirst
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) August 10, 2020
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరంలో దాదాపు 18500 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. బీరట్‌లో 2700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వలతో భారీ పేలుళ్లు సంభవించడంతో... ఇంత భారీ ఎత్తున విశాఖలో కెమికల్ నిల్వ ఉండటంపై ఆందోళన వ్యక్తమైంది. అయితే సురక్షిత పద్దతిలోనే దాన్ని నిల్వ చేశారని.. ప్రమాదమేమీ లేదని అధికారులు నిర్దారించారు.












Click it and Unblock the Notifications