2 నెలల్లో 70 కేజీల బరువు తగ్గించిన వైద్యులు
హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ ప్రాంతానికి చెందిన మునీందర్(24) చిన్నతనం నుంచే ఊబకాయంతో బాధపడుతుండేవాడు.
అతి బరువు బాధపడుతోన్న ఓ యువకుడికి ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు బేరియాట్రిక్ సర్జరీతో ఊరట కల్పించారు. ఈ తరహా చికిత్స చేయడం ప్రభుత్వాస్పత్రిలో ఇదే తొలిసారని తెలిపారు. ప్రస్తుతం ఆ యువకుడి బరువు170 కేజీలకు చేరింది. సర్జరీకి ముందు 240 కేజీలు ఉండేవాడు. దాదాపు 70 కేజీల తగ్గుదల కనిపించిందని, మరో 90 కేజీలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ ప్రాంతానికి చెందిన మునీందర్(24) చిన్నతనం నుంచే ఊబకాయంతో బాధపడుతుండేవాడు. వయసుతోపాటు బరువు కూడా పెరిగింది. చివరకు నడవడం కష్టంగా మారింది. తల్లిదండ్రులు ప్రైవేటు ఆసుపత్రిలో చూపించగా.. సర్జరీ కోసం రూ.10-రూ.12 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. చివరికి ఉస్మానియా వైద్యులను వారు సంప్రదించారు.

ఈ నేపథ్యంలో అనస్తీషియా, ఎండోక్రైనాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాలకు చెందిన 15 మంది వైద్యులు ఒక టీమ్ గా ఏర్పడి మునీందర్ కు బేరియాట్రిక్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. గ్యాస్ట్రిక్ బైపాస్ ద్వారా పొట్ట పరిమాణం తగ్గించడంతోపాటు, ఎక్కువ ఆహారం తీసుకోకుండా నియంత్రించేందుకు ఆహారం స్వీకరించే చిన్నపేగును కూడా కొంత మేరకు తగ్గించారు. రెండు నెలల క్రితం ఈ సర్జరీ విజయవంతంగా జరిగింది. లాప్రోస్కోపిక్ విధానంలో పొట్ట పరిమాణాన్ని తగ్గించారు.

ప్రభుత్వాస్పత్రుల్లో బేరియాట్రిక్ సర్జరీలు చేయడం చాలా అరుదు. మునీందర్ అధిక బరువుతో ఉండటం, భారమంతా మోకాళ్లపై పడటం, షుగరు, అధిక రక్తపోటు లాంటి శారీరీక, మానసిక రుగ్మతలకు కారణమవుతుండటంతో ఉస్మానియా వైద్యులు మానవీయ కోణంలో స్పందించారు. ఆ యువకుడికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. సర్జరీ చేసే సమయంలో పలు ఇబ్బందులు ఎదురైనట్లు వైద్యులు వెల్లడించారు. 240 కేజీల బరువున్న మునీందర్ ను ఆపరేషన్ టేబుల్ పై పడుకోబెట్టడం కూడా కష్టంగా మారిందని తెలిపారు. శరీరానికి రెండువైపులా అదనపు బల్లలు ఏర్పాటుచేసి అతి కష్టంమీద సర్జరీని పూర్తిచేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా బేరియాట్రిక్ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన వైద్యులను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అభినందించారు.












Click it and Unblock the Notifications