పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా బంగారం పట్టివేత .. 12 కోట్ల విలువైన 26 కిలోల బంగారం
చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన తనిఖీలలో భారీగా బంగారం బయటపడింది. హైదరాబాద్ నగర శివార్లలో దేశంలోకి అక్రమంగా రవాణా చేసిన 26 కిలోల బంగారాన్ని హైదరాబాద్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) మంగళవారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు. బంగారం అక్రమ రవాణాకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.

వాహన తనిఖీలలో పట్టుబడిన భారీ బంగారం
పక్కా సమాచారంతో హైదరాబాద్‌కు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంతంగి టోల్ ప్లాజా వద్ద అనుమానం వచ్చి ఒక ఎస్‌యూవీని వారు తనిఖీ చేశారని డిఆర్‌ఐ బృందం తెలిపింది. అస్సాం రిజిస్ట్రేషన్ ప్లేట్ ఉన్న వాహనాన్ని తనిఖీ చేస్తున్నప్పుడు, నాలుగు వేర్వేరు కంపెనీల బంగారు కడ్డీలు కారు లోపల ఒక సీక్రెట్ ప్లేస్ లో పెట్టినట్టు గుర్తించారు . ఎయిర్‌బ్యాగ్‌లను తొలగించి బంగారాన్ని డాష్‌బోర్డ్ లో ఎయిర్ బ్యాగ్స్ స్థలంలో తెలివిగా దాచిపెట్టారు, అని అధికారులు తెలిపారు.

చెన్నైలో బంగారం డెలివరీకి వెళ్తున్న మాఫియా సభ్యులు
గౌహతి నుండి రోడ్డు మార్గంలో బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారని గుర్తించారు.
వారు బంగారాన్ని గ్లూ ఉపయోగించి డాష్‌బోర్డ్ లో కనిపించకుండా అతికించారు . డాష్ బోర్డును సీజ్ చేశారు అధికారులు . వాహన తనిఖీల సమయంలో వారు అధికారులను మోసగించే ప్రయత్నం చేశారని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో స్మగ్లింగ్ చేసిన విదేశీ మార్క్ బంగారాన్ని చెన్నైలో డెలివరీ చేయాలంటూ మాఫియా ముఠాకు అప్పగించినట్లుగా పోలీసులు గుర్తించారు.

12 కోట్ల రూపాయల విలువైన 26 కిలోల బంగారాన్ని సీజ్ చేసిన డిఆర్ఐ అధికారులు
12 కోట్ల రూపాయల విలువైన 26 కిలోల బంగారాన్ని డిఆర్ఐ అధికారులు ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు. కలకత్తా నుంచి చెన్నైకి తీసుకు వెళుతున్న ముగ్గురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
అదుపులోకి తీసుకున్న వారి నుండి కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. విదేశాలనుండి బంగారం ఎలా వచ్చింది. ఎవరికి ఇచ్చేందుకు ఈ బంగారాన్ని తీసుకెళ్తున్నారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications