ప్రియుడి మోజులో పడి కన్న కూతుర్నే కడతేర్చింది: ఆపై నాటకాలు
హైదరాబాద్: వివాహేతర బంధాల కోసం కన్నవారిని కూడా కడతేర్చేందుకు వెనుకాడటం లేదు కొందరు దుర్మార్గులు. కామవాంఛతో ప్రియుడి మోజులో పడి భర్తలను చంపిన ఉదంతాలు చూశాం. మరికొందరు కట్టుకున్న భార్యలను కడతేర్చిన ఘటనలు జరిగాయి. తాజాగా, ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత.. కడుపున పుట్టిన చిన్నారిని దారుణంగా హత్య చేసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో చోటు చేసుకుంది.
ఓ యువకుడితో వివాహేతర సంబంధం కారణంగా తన కూతురును ఆమె తల్లే హత్య చేసిందని ఆరోపించారు చిన్నారి తండ్రి. ఈ మేరకు దర్యాప్తు జరిపిన పోలీసులకు అదే నిజమని తేలడం గమనార్హం. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఆ మహా తల్లి తన కూతురును తానే హత్య చేసినట్లు అంగీకరించింది.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కుషాయిగూడ మార్కెట్ వెనుక వీధిలో నివాసముంటున్న నాయిక్‌వాడి రమేష్ కుమార్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం కళ్యాణి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు నాలుగున్నరేళ్ల కూతరు తన్విత ఉంది. అయితే, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో 2021 నుంచి విడివిడిగా ఉంటున్నారు.
కళ్యాణి కూతురుని తీసుకుని కుషాయిగూడలోని తల్లిదండ్రుల ఇంటి సమీపంలో ఓ గదిని అద్దె తీసుకుని ఉంటోంది. తన్విత స్థానిక ప్రైవేట్ పాఠశాలలో నర్సరీ చదువుతోంది. అయితే, కళ్యాణికి స్థానికంగా ఉన్న మరో యువకుడితో పరిచయం ఏర్పడి అది వివాహేతర బంధానికి దారితీసింది. ఈ క్రమంలోనే తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న తన కూతురును చంపాలని నిర్ణయించుకుంది కళ్యాణి.
జులై 1న శనివారం మధ్యాహ్నం చిన్నారి తన్విత స్కూల్ నుంచి వచ్చి భోజనం చేసి కాసేపు ఆడుకుంది. కూరగాయల మార్కెట్లో పనిచేసే తల్లి కళ్యాణి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తన్విత నిద్రిస్తోంది. ఎంతకీ లేవకపోవడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. చిన్నారి అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధరించారు. నిద్రిస్తున్న కూతరు నిద్రలోనే మృతి చెందిందన్న కళ్యాణి.. ఎవరికీ అనుమానం రాకుండా కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇదే విషయాన్ని ఇరుగుపొరుగు, బంధువులకు తెలిపింది.
అయితే, కూతురు మృతిపై భార్యపైనే అనుమానం వ్యక్తం చేసిన భర్త రమేష్.. జులై 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనుమానాస్ప మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఊపిరాడక చిన్నారి మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. దీంతో పోలీసులు చిన్నారి తల్లి కళ్యాణిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తన కూతురును తానే హత్య చేసినట్లు అంగీకరించింది.












Click it and Unblock the Notifications