ఎమ్మెల్యే రాజా సింగ్‌కు మరోసారి పోలీసుల నోటీసు: ఎందుకంటే?
హైదరాబాద్: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టై.. ఇటీవలే బెయిల్‌పై విడుదలైన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు మంగళ్‌హాట్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫేస్‌బుక్‌లో ఓ పోస్టుకు రాజా సింగ్ కామెంట్ చేయడంతో పోలీసులు మంగళవారం రాత్రి నోటీసులు జారీ చేశారు.
హైకోర్టు ఆదేశాలు పాటించకుండా.. ఓ సామాజికవర్గంపై రాజా సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించారంటూ నోటీసులు జారీ చేసిన పోలీసులు.. దీనికి రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని రాజా సింగ్ ను ఆదేశించారు.

రాజా సింగ్ ఓ వర్గానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆయనపై ఆగస్టు 25న పీడీయాక్ట్ కేసు నమోదు చేసిన పోలీసులు.. అరెస్ట్ చేసి, చర్లపల్లి జైలుకు తరలించారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బీజేపీ కూడా రాజా సింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
ఈ క్రమంలో దాదాపు 40 రోజులపాటు జైల్లో ఉన్న రాజా సింగ్.. ఇటీవలే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. పీడీ యాక్టును కూడా హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. అయితే, బెయిల్ ఇచ్చిన సమయంలో హైకోర్టు కొన్ని షరతులు విధించింది. మళ్లీ ఏ వర్గాన్ని కించపర్చేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది.
అయితే, తాజాగా, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ రాజా సింగ్‌కు మళ్లీ మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారంటూ నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసులపై రాజాసింగ్ స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications