Hyderabad: అక్రమార్కులను హడలెత్తిస్తున్న హైడ్రా.. రాయదుర్గంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత..
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ( Hydra)అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. అవతలి అక్రమార్కుడు వీఐపీ అయినా వీవీఐపీ అయినా డోంట్ కేర్ అంటూ ముందుకెళ్తోంది. శనివారం మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ లో తుమ్మిడికుంట చెరువు అక్రమించి నిర్మించిన నిర్మాణాలను హైడ్రో నేలమట్టం చేసింది. తాజాగా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం ఏరియాలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది.
సోమవారం తెల్లవారుజామున భారీ ఎత్తున బుల్డోజర్లు ఆ ప్రాంతానికి వెళ్లిన అధికారులు కూల్చివేతలు చేపట్టారు. రాయదుర్గం సర్వే నెంబర్ 3, 4, 5 మొత్తం ప్రభుత్వం స్థలం ఉంది. అందులో అక్రమంగా కొందరు శాశ్వత నిర్మాణాలు నిర్మించారు. వీటిపై హైడ్రాకు ఫిర్యాదులు వెళ్లాయి. అక్రమంగా నిర్మించిన ఇళ్లను నేలమట్టం చేశారు. అయితే స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే పోలీసులు వారికి సర్దిచెప్పడంతో నిర్మాణాలు కూల్చి వేశారు.

రాయదుర్గం పరిధిలోని సర్వే నెంబర్లు 3, 4, 5 భూముల్లోని అన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. హైడ్రా ఇప్పటి వరకు 18 చోట్ల చెరువులు, పార్కు స్థలాల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. దాదాపు 43.94 ఎకరాలు చెరువు భూములను రక్షించారు. అయితే హైడ్రా కూల్చేసిన అక్రమ నిర్మాణాల్లో ఎంఐఎం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పలు పార్టీల నాయకుల నిర్మాణాలు ఉన్నట్లు తెలిసింది.
హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాలకు సంబంధించి హైడ్రాకు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. చాలా మంది హైడ్రాను అభినందిస్తూ.. తమ ప్రాంతాల్లో కూడా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి.. వాటిని కూల్చివేయాలని కోరుతున్నారు. కొందరరైతే మ్యాప్ తో సహా ఎక్స్ లో పోస్ట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications