ఆయనను బాత్రూంలో బంధించారా? సోనియా కాంగ్రెస్ అధ్యక్షురాలైన వేళ అసలేం జరిగింది?
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై ఇప్పటివరకు చాలా పుస్తకాలు వచ్చాయి. వాటిలో ప్రముఖ జర్నలిస్ట్, రచయిత రషీద్ కిద్వాయ్ రాసిన '24 అక్బర్ రోడ్: ఏ షార్ట్ హిస్టరీ ఆఫ్ ది పీపుల్ బిహైండ్ ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ కాంగ్రెస్' అనే పుస్తకంలో 1998 నాటి సంచలన రాజకీయ పరిణామాలను వివరించారు. నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేసరిని అత్యంత అవమానకర రీతిలో పదవి నుంచి తప్పించి.. సోనియా గాంధీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తీరును ఈ పుస్తకంలో ప్రస్తావించారు.
అధ్యక్షుడిని తప్పించే కుట్ర ఎలా మొదలైందంటే..?
బీహార్‌కు చెందిన సీతారాం కేసరి ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుడు. 1980 నుంచి 1996 వరకు కాంగ్రెస్ కోశాధికారిగా పనిచేశారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం తర్వాత పీవీ నరసింహారావు అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో 1996 సెప్టెంబర్లో సీతారాం కేసరి తాత్కాలిక అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత 1997 జూన్‌లో జరిగిన ఎన్నికల్లో శరద్ పవార్, రాజేశ్ పైలట్ వంటి నేతలను ఓడించి పూర్తిస్థాయి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే కొద్దికాలానికే సోనియా గాంధీ విధేయుల వర్గానికి సీతారాం కేసరి కంటగింపుగా మారారు. ఆయన పార్టీలో వెనుకబడిన వర్గాల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, ప్రధాని కావాలనే ఆశతో సోనియా సన్నిహితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు మొదలయ్యాయి. దీంతో సీతారాం కేసరిని పదవి నుంచి తప్పించేందుకు సోనియా సన్నిహిత వర్గం పావులు కదపడం ప్రారంభించింది.

ప్రచారానికి దూరంగా ఉంచి.. ఓటమి నెపాన్ని నెట్టేశారు!
1998 ఫిబ్రవరిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జాతీయాధ్యక్షుడిని ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచారు. కనీసం ఆయన సొంత రాష్ట్రం బీహార్‌కు కూడా ప్రచారానికి పిలవలేదు. జలంధర్ వెళ్తున్న ఆయన విమానాన్ని అంబాలా నుంచే వెనక్కి రప్పించి.. శ్వాసకోశ ఇబ్బంది కారణంగా రద్దయిందని ప్రకటించారు. ఆ ఎన్నికల్లో సోనియా గాంధీ 130 సభల్లో ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ కేవలం 142 సీట్లకే పరిమితమై ఘోర పరాజయం పాలైంది. ఆఖరికి కంచుకోట అమేథీలోనూ ఓడిపోయింది. అయితే ప్రచారానికి కూడా పిలవని సీతారాం కేసరంపైనే ఈ ఓటమి నెట్టేసిన సోనియా వర్గం.. పార్టీ పగ్గాలు చేపట్టాలని సోనియా గాంధీపై ఒత్తిడి తెచ్చింది.
1998 మార్చి 14: సీడబ్ల్యూసీ సమావేశంలో హైడ్రామా
రషీద్ కిద్వాయ్ పుస్తకం ప్రకారం.. 1998 మార్చి 14న ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం జరిగింది. అధ్యక్షుడైన సీతారం కేసరి కార్యాలయానికి రాగా.. కేవలం తారిఖ్ అన్వర్ మాత్రమే ఆయనకు స్వాగతం పలికారు. అప్పటికే ప్రణబ్ ముఖర్జీ నివాసంలో సోనియా వర్గీయులు రహస్యంగా సమావేశమై.. సీతారాం కేసరిని తప్పించి సోనియా గాంధీని అధ్యక్షురాలిగా చేసే తీర్మానానని సిద్ధం చేసుకునన సంగతి ఆయనకు తెలియదు. సమావేశం ప్రారంభం కాగానే ప్రణబ్ ముఖర్జీ లేచి ఆ తీర్మానాన్ని చదవడం మొదలుపెట్టారు. సీతారాం కేసరి సేవలకు ధన్యవాదాలు చెబుతూ.. సోనియా గాంధీని అధ్యక్షురాలిగా ప్రతిపాదించారు. దీంతో దిగ్భ్రాంతికి గురైన సీతారాం కేసరి.. "అరే, ఏం చేస్తున్నారు మీరు?" అంటూ గట్టిగా అరిచారు. ఆయన ఆందోళనను చూసి సోనియా మద్దతుదారులు నవ్వుకున్నారు. ఈ రాజ్యాంగ విరుద్ధమైన సమావేశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీతారాం కేసరి బయటకు వచ్చేశారు.
బాత్రూంలో బంధించారన్న ఆరోపణలు.. నేమ్ ప్లేట్ తొలగింపు
ఆ రోజు జరిగిన పరిణామాలపై అప్పట్లో సంచలన కథనాలు వెలువడ్డాయి. సోనియా గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే వరకు సీతారాం కేసరిని బాత్రూంలో బంధించారని అప్పట్లో కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అంతేకాకుండా ఆయన బయటకు వచ్చి తన కారు వైపు వెళ్తుండగా.. కొందరు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ధోతీని లాగి అవమానించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. కాంగ్రెస్ కార్యాలయంలోని అధ్యక్షుడి గది బయట ఉన్న సీతారాం కేసరి నేమ్ ప్లేట్‌ను పీకేసి.. ఆ స్థానంలో 'కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ' అని రాసి ఉన్న ఓ పేపర్ ప్రింట్ అవుట్‌ను అంటించారని రషీద్ కిద్వాయ్ తన పుస్తకంలో పేర్కొన్నారు.














Click it and Unblock the Notifications
