సడన్ గా ఇంట్లో ప్రత్యక్షమైన చిరుతపులి: ఇంట్లోవాళ్ల పైప్రాణాలు పైనే పోయుంటాయ్
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఇంట్లోకి చిరుతపులి అకస్మాత్తుగా చొరబడింది. రాత్రివేళ దంపతులు ఇంట్లో టీవీ చూస్తోన్న సమయంలో ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మొదట వీధి కుక్కగా భావించారు దీన్ని. బయటికి తరమడానికి ప్రయత్నించగా గర్జిస్తూ మీదికి ఉరికిందా చిరుత. దీంతో ఆ దంపతులు బిత్తరపోయారు. గట్టిగా కేకలు వేశారు. ఆ పరిస్థితుల్లోనూసమయస్ఫూర్తితో వ్యవహరించారు. అది లోపల ఉండగానే ఇంటి తలుపులు మూసి బంధించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.
తుమకూరు జిల్లాలోని బండిగౌడనపాళ్యలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చిక్కమరియప్ప ఇంటి బయట కట్టేసిన మేక పిల్లపై మొదట చిరుత దాడి చేసింది. దాన్ని నోట కరుచుకుని ఎత్తుకెళ్లే క్రమంలోనే, అకస్మాత్తుగా ఇంట్లోకి ప్రవేశించింది. ఆ సమయంలో చిక్కమరియప్ప, ఆయన భార్య నరసమ్మ హాలులో కూర్చుని టీవీ చూస్తోన్నారు. ఒక్కసారిగా తమ కళ్ల ముందు ఈ వన్యప్రాణి ప్రత్యక్షం కావడంతో బిత్తరపోయారు. వెంటనే బయటకు పరుగులు తీసి గడియ పెట్టారు. ఈ ఊహించని ఈ ఘటనతో నరసమ్మ స్పృహ తప్పి పడిపోయారు.

ఇంట్లో చిరుత చిక్కుకుపోయిన విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు ఆరు గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ అనంతరం బోన్లు, వలల సహాయంతో ఆ చిరుతపులిని సురక్షితంగా బంధించారు. దీంతో ఆ ఊరి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటన జరిగిన వెంటనే స్థానిక రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఛైత్రతో పాటు ఇతర అధికారులను గ్రామస్తులు చుట్టుముట్టారు. నెల రోజులుగా గ్రామం పరిసర ప్రాంతాల్లో చిరుతల సంచారం ఎక్కువగా ఉందనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే ఇటువంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తాయని స్థానికులు మండిపడ్డారు.
తుమకూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో క్రూర మృగాల సంచారం పెరగడం స్థానికులను తీవ్రంగా కలవరపెడుతోంది. రాత్రి వేళల్లో పెంపుడు జంతువులపై దాడులు చేయడం సాధారణం అయ్యాయని, ఇప్పుడు నేరుగా ఇళ్లలోకి చొరబడటం భయాందోళనలను మరింత పెంచిందని ప్రజలు అంటున్నారు. అడవుల విస్తీర్ణం తగ్గడం, ఆహారం, నీటి అన్వేషణలోనే చిరుతలు గ్రామాల వైపు వస్తున్నాయని అటవీ సిబ్బంది చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
