చంద్రబాబు అంటే గౌరవం, కానీ..: పార్టీ మార్పుపై తేల్చేసిన రాజా సింగ్
హైదరాబాద్: తాను తెలుగుదేశం పార్టీలో చేరతానంటూ వస్తున్న వార్తలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. ప్రస్తుతం ఆయనపై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. అంతేగాక, పలు పత్రికలు కూడా కథనాలను ప్రచురితం చేశాయి. ఈ క్రమంలో ఆయన తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కొట్టివేశారు.
తాను పార్టీ మారడం లేదని, టీడీపీలో చేరడం లేదని రాజా సింగ్ స్పష్టం చేశారు. తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. తనపై పార్టీ విధించిన సస్పెన్షన్ ఎత్తివేసే వరకు ఎదురుచూస్తానని చెప్పారు. తనకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రులు, ఇతర బీజేపీ నేతల మద్దతు ఉందని తెలిపారు.

మరోవైపు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై రాజా సింగ్ ప్రశంసలు కురిపించారు. రాజకీయంగా తనకు చంద్రబాబే లైఫ్ ఇచ్చారని.. ఆయనపై అపార గౌరవముందని అన్నారు. అయితే, గౌరవం వేరు.. రాజకీయాలు వేరు అని చెప్పారు. తాను బీజేపీకి మాత్రమే సూట్ అవుతానని.. తన మెంటాలిటీ ఏ పార్టీకీ సరిపోదని రాజా సింగ్ వ్యాఖ్యానించారు. తాను బీజేపీలోనే ఉంటానని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగానే పోటీ చేస్తానని రాజా సింగ్ స్పష్టం చేశారు.
కాగా, రాజా సింగ్ రాజకీయ ప్రవేశం తెలుగుదేశం పార్టీలోనే ప్రారంభమైంది. 2009లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలిచారు రాజా సింగ్. ఆ తర్వాత బీజేపీలో చేరి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు రాజా సింగ్.
ఇటీవల ఆయన ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అయితే, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో రాజా సింగ్‌పై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. ఇంకా ఆ సస్పెన్షన్ ఎత్తి వేయలేదు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే, తాను బీజేపీలో కొనసాగుతానని.. మరో పార్టీలో చేరే ప్రసక్తే లేదని రాజా సింగ్ తేల్చి చెప్పారు. తాను ధర్మం కోసం పోరాటం చేస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications